జార్ఖండ్ దారిలోనే మరికొన్ని.. చివరికి మిగిలేది!
ఒకప్పుడు అణగారిన వర్గాలు, అసమానతలు. అవిప్పుడు లేవా అంటే ఉన్నాయి. కానీ ఏడుదశాబ్ధాలనాటి పరిస్థితులైతే లేవు. సామాజికంగా మార్పులు వచ్చాయి. సామాజిక స్పృహ పెరిగింది. పోటీ తత్వం పెరిగింది. విద్య, ఉద్యోగం ఎవరి సొత్తూ కాదన్న పరిస్థితులున్నాయి. ప్రతిభ ఉంటే చాలు కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా ఎదుగుతోంది ఈతరం. కానీ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమయంలోనూ ఈ దేశంలో రిజర్వేషన్ల రగడ జరుగుతోంది. ఆ ముసుగులో ఓట్ల రాజకీయం నడుస్తోంది.
అత్యున్నత న్యాయస్థానమే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను సమర్ధించటంతో 50శాతం మించకూడదనే నియమం పేలపిండిలా తేలిపోతోంది. ఇప్పుడు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే అక్కడ 60శాతం రిజర్వేషన్లు ఉంటే వాటిని ఏకంగా 77 శాతానికి పెంచుతూ జార్ఖండ్ శాసనసభ బిల్లుని ఆమోదించింది. తాజా బిల్లుతో రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 77 శాతానికి పెరుగుతాయి. జార్ఖండ్‌లో షెడ్యూల్డ్ కులాలకు 12 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 28 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) 15 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 12 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ కోటా లభిస్తుంది. జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయం రిజర్వేషన్ల రాజకీయాలు నడుస్తున్న రాష్ట్రాలకు ఓ దారి చూపిస్తోంది.
రాష్ట్రంలో 5 శాతం రిజర్వేషన్ కోసం కాపుల డిమాండ్. మొన్ననే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో ఆరుశాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను ప్రభుత్వం పదిశాతానికి పెంచింది. పెంచిన రిజర్వేషన్లను రోస్టర్ జాబితాలో సర్దుబాటు చేసింది. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కబోతోంది. ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ప్రభుత్వం చట్టంచేసింది. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ని సుప్రీం సమర్థించటంతో ఏపీలో కాపు రిజర్వేషన్లపై ఆ సామాజికవర్గం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.