మతం మారినా రిజర్వేషన్లు- అంతులేని కథ!

By KTV Telugu On 8 October, 2022
image

స్వతంత్ర భారతంలో ఈ చర్చకు తెరపడదా!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలైపోయింది. అమృత్‌ మహోత్సవం జరుపుకుంటున్నాం. అయినా సామాజిక అసమానతలు సువిశాల భారతానికి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. ఎన్ని మార్పులు, కూర్పులు చేస్తున్నా రిజర్వేషన్ల కుంపటి దేశంలో రగులుకుంటూనే ఉంది. రాష్ట్రాల్లో ఓటు రాజకీయాలకోసం రిజర్వేషన్‌ పావుగా మారుతుంటే, కేంద్రంలోని పెద్దలకు కూడా అవే పాచికలవుతున్నాయి.
దేశంలో తరతరాల సామాజిక వెనుకబాటుతో ఎస్సీలకు రాజ్యాంగం రిజర్వేషన్లతో భరోసా ఇచ్చింది. 1950లో హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారు. 1956లో సిక్కు మతంలోని దళితులను, 1990లో బౌద్ధ దళితులను కూడా చేర్చారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోని దళితులను ఎస్సీలుగా పరిగణించరు. అంటే ఇస్లాం, క్రైస్తవంలోకి మతమార్పిడి అయిన దళితులకు ఎస్సీ ప్రయోజనాలు వర్తించవు.
క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్‌ ఇప్పటిది కాదు. 1996లో ప్రభుత్వం రాజ్యాంగ ఆదేశాల సవరణ బిల్లును రూపొందించినా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. 2004లో రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ ఎస్సీ హోదాకు, మతానికి లంకె అవసరం లేదని సిఫార్సు చేసింది. 2005లో ఏర్పాటైన జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ కమిషన్‌ మత మార్పిడి తర్వాత కూడా దళిత ముస్లిం, దళిత క్రైస్తవుల పరిస్థితుల్లో మార్పు లేదని తేల్చింది.
సతీశ్‌ దేశ్‌పాండే కమిటీ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకూ ఎస్సీ హోదా విస్తరించాలంటూ 2008లో సిఫార్సు చేసింది. జాతీయ మైనార్టీ కమిషన్‌ కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేసింది. ఎన్ని జరిగినా సరైన గణాంకాలు లేవన్న కారణంతో వేటినీ పరిగణనలోకి తీసుకోలేదు. అయితే
దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని అభిప్రాయం కోరింది. దీంతో రిజర్వేషన్లు వర్తించే మూడు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన దళితుల స్థితిగతులను అధ్యయనం చేయటానికి కేంద్రప్రభుత్వం జాతీయ కమిషన్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
ఎస్టీలు ఏ మతంలో ఉన్నా వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు దక్కుతాయి. ఎస్టీల హక్కులు వారి మతం, విశ్వాసాలకు అతీతమైనవి. మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుతో పలు క్రిస్టియన్‌, ముస్లిం వర్గాలకు కూడా ఓబీసీ జాబితాలో చోటు దక్కింది. దీంతో ఎస్టీలు, ఓబీసీలకు మతాలకతీతంగా రాజ్యాంగ ప్రయోజనాలు దక్కుతున్నాయి. అందుకే దళితులు కూడా తమకు కూడా అదే విధానం అమలుకావాలని కోరుకుంటున్నారు.