ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామంటారు చాలామంది నాయకులు. రాజకీయం అంటే మాటలు కాదు.
నేతల వారసులకు తప్పించి మిగతావారు తీవ్రంగా శ్రమించాలి. నిత్యం ప్రజల మధ్య ఉండాలి. ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొనాలి. అంతే కాదు ప్రత్యర్థుల నుంచి వచ్చే తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ చేసినా ఎన్నికల్లో గెలుస్తారా అంటే డౌటే. ఒక్కోసారి డిపాజిట్ కూడా దక్కదు. చాలాకొద్ది మంది మాత్రం నిజాయితీగా ప్రజా సేవ చేయాలని పాలిటిక్స్‌లోకి వస్తారు. అలాంటివారు కూడా ఆ తరువాత కనిపించకుండా పోతారు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ ఇందుకు ఉదాహరణ. రాజకీయం అనేది ఒక ఊబి అని తెలిసి కూడా ఈమధ్య కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఆమధ్య ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీ లో చేరి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు.
ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాలిటిక్స్ లోకి ఎంటరవుతున్నారు. ఈయన ఏకంగా తాను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వివరాలు బయటపెడతానని కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణలో రాజకీయం వ్యాపారంగా మారిపోయిందని ఆదర్శ రాజకీయాలను మళ్లీ తెలంగాణ ప్రజలకు అందించేందుకు త్వరలో నూతన రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేయబోతున్నట్లు మురళి స్పష్టం చేశారు. మురళి గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. పదవీకాలం మిగిలి ఉండగానే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని ఆ తర్వాత ఏపీలోని జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారుడిగా ఆయన పనిచేశారు. ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణలో ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. కొంతకాలంగా ఈయన కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఐఎంఐ, వైఎస్‌ఆర్‌టీపీ, బీఎస్పీ వంటి పార్టీల నడుమ ఆకునూరి మురళి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ నిలదొక్కుకుంటుందా, ప్రజలు ఆదరిస్తారా అనేది వేచి చూడాలి.