దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే గెలుపు గుర్రం. ఆయనను నమ్ముకుంటే చాలు పీఠాలు దక్కేస్తాయని చాలా మంది నమ్మకం. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు కాదు ఏకంగా ఆ పార్టీలో చేరేందుకే ప్రయత్నిస్తున్నారు. ఆయన కోరుకుంటున్న ప్రాదాన్య ఇస్తే పార్టీలో చేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. పీకే వల్ల కాంగ్రెస్‌కు ఎంత లాభం వస్తుందోనన్న లెక్కలు కాంగ్రెస్ హైకమాండ్ వేసుకుంటోంది. ఈ క్రమంలో పీకే కాంగ్రెస్‌లో చక్రం తిప్పితే.. తెలంగాణలో పరిస్థితులు ఎలా మారిపోతాయన్న ఆందోళన రేవంత్ వర్గీయుల్లో పెరిగిపోతోంది. దీనికి కారణం కేసీఆర్- పీకే మధ్య ఉన్న పొలిటికల్ స్నేహమే.
కాంగ్రెస్‌తో పొత్తు దిశగా టీఆర్ఎస్ను నెడతారారా ?
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా పరస్పరం ప్రత్యర్థులు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడంలో మాత్రం ఈ రెండు పార్టీలదీ ఒకటే ఎజెండా. ఆ పోరాటంలో జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా అనేది కొంత కాలంగా ఉన్న చర్చ. టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలాంటి ఆలోచన చాన్సే లేదని రేవంత్ కుండబద్దలు కొట్టారు. కానీ అది అప్పుడు.. ఇప్పుడు తేడా పీకేనే. పీకే వ్యూహాలను రాహుల్ అమలు చేయాలని చూస్తే సీన్ మారిపోయే చాన్స్ ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఆయన సూచిస్తే రేవంత్ రెడ్డి బలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన పీకే వ్యూహాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
టీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు చేదు అనుభవాలు పీకే చెప్పినా పొత్తు కష్టమే !
టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ఇటీవల నొక్కిచెప్పారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చే నెలలో వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభకు ఆయన హాజరుకానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర నేతలకు రూట్ మ్యాప్‌నూ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్తో సాఫ్ట్‌గా వెళ్లాలని.. ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉపయోగపడుతుందని పీకే చెబితే.. అంగీకరించే పరిస్థితి ఉండదని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. బీజేపీకి కేసీఆర్ లేని పోని ప్రాధాన్యం కల్పించి ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని పీకే సలహాలు పాటిస్తే మొదటికే మోసం వస్తుందని .. మొత్తంగా కాంగ్రెస్ మైనర్ భాగస్వామిగా మారుతుందని అది ఆత్మహత్య సదృశమని వాదిస్తున్నారు. ఈ విషయంలో హైకమాండ్‌కూ భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు.
కాంగ్రెస్‌కు పని చేస్తే టీఆర్ఎస్కు హ్యాండివ్వనున్న పీకే !
కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా, పూర్తికాలం పార్టీ సభ్యుడిగా పీకే వ్యవహరిస్తే టీఆర్ఎస్ కు సేవలు అందే అవకాశం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బలమైన శక్తిగా అవతరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నది. ఈ రెండు ప్రయోజనాల కోసం పీకేతో కలిసి పనిచేయాలనుకుంటున్నది. కానీ ఊహించని తీరులో పీకే షాక్ ఇవ్వడంతో ఇప్పుడు టీఆర్ఎస్ డైలమాలో పడింది. కాంగ్రెస్ పార్టీతో పీకేకు డీల్ కుదరడంతో ఇకపైన ఆయనను దూరం పెట్టడం టీఆర్ఎస్కు అనివార్యంగా మారింది. వాస్తవానికి టీఆర్ఎస్కు వ్యూహకర్తగా పీకే ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదు. సర్వే మాత్రం చేసి పెట్టారు.
కేసీఆర్‌ను ఓడించడమే రేవంత్ లక్ష్యం !
రేవంత్ రెడ్డి పొలిటికల్ టార్గెట్ చాలా క్లియర్. టీఆర్ఎస్, కేసీఆర్ లను ఓడించి తాను సీఎం అవడమే లక్ష్యం. అందుకే ఆయన టీడీపీని వదిలి పెట్టారు. రాజకీయ పునరేకీకరణ కావాలని కాంగ్రెస్‌లో చేరారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు తన లక్ష్యానికి పీకే రూపంలో అడ్డం పడితే ఆయన ఊరుకునే చాన్సే లేదు. అందుకే ఇప్పుడు పీకే వ్యూహాలపై హైకమాండ్ నిర్ణయాలను బట్టి రేవంత్ తదుపరి యాక్షన్ ఉండే అవకాశం ఉంది.