తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సామాజికవర్గంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆయనను సమర్థిస్తోంది. మరో వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. సహజంగానే ఇతర రాజకీయ పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. ఇంతకీ రేవంత్ రెడ్డి… తన సామాజికవర్గాన్ని మాత్రమే ఎందుకు హైలెట్ చేస్తున్నారు ? అధికారంలోకి రావాలంటే ఇతర కులాలు అక్కర్లేదనుకుంటున్నారా ? ఏపీలోలా కుల ద్వేషంతో అధికారం సాధిచాలనుకుంటున్నారా ?
గెలవాలంటే రెడ్లు నాయకత్వం వహించాల్సిందేనని రేవంత్ వాదన !
ఏ పార్టీ గెలవాలన్నా రాజకీయం చేయాలన్నా ఆ పార్టీలు రెడ్ల చేతిలో ఉండాలని పిసిసి చీఫ్ రేవంత్ ఇటీవల విశ్లేషించారు. దానికి ఆయన చారిత్రక కారణాలు చెప్పారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని చరిత్ర చెప్పారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు, నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని, దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి పద్మనాయకులను దగ్గరికి తీశాడని గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి.. వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదని విశ్లేషించారు. ప్రతి రెడ్డికి 10ఎకరాలు ఉన్నప్పుడే రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుందని చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పేదలకు సాయం చేసి రెడ్ల గౌరవాన్ని పెంచుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం !
రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్‌లోని ఓ వర్గంతో పాటు.. ఇతర పక్షాలన్నీ ఖండిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యంపై అవగాహన లేకే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో కనీస సమాచారం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇతర సామాజిక వర్గాలను పార్టీకి దూరం చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలు కూడా దీన్ని స్వాగతించడం లేదు. రేవంత్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశాడో తనకు తెలియదు కానీ మెజారిటీ వర్గాలను దూరం చేసుకొంటే పార్టీకి నష్టమని ఈ అంశంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో రెడ్డి నేత జగ్గారెడ్డి రేవంత్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని తాను అన్ని కులాల నాయకుడినని, తనను ఈ పంచాయితీలోకి లాగొద్దని తేల్చేశారు.
రెడ్లకు, వెలమలకు మధ్య రాజకీయ ద్వేషం పెంచడానికేనా?
కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి సడెన్ గా కులాల ప్రస్తావన తీసుకురావడం రాజకీయ వ్యూహమేనని కొందరు నేతలు భావిస్తున్నారు. రెడ్డి వర్సెస్ వెలమ రాజకీయాలను తెరపైకి తెచ్చేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో కులం పాత్రను ఎవరూ కాదనలేరు. ప్రతి రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్‌గా కొన్ని కులాలు ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా రెడ్ల యువత కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. ఇప్పుడు మూలాలను బలపరుచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సామాజికవర్గాలను తెరపైకి తెస్తున్నారు. సహజంగా వెలమ సామాజికవర్గం దొరలు. దొరలపై ప్రజానీకం పోరాటం చేసిన ఉంది కాబట్టి… ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతరులు దూరం అయితే మొదటికే మోసం !
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడికి ఇంత కులపిచ్చ ఎందుకని కొంత మంది విమర్శిస్తూంటే… వ్యూహాత్మకంగా రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడమే కాకుండా… వెలమల పెత్తనం ఏమిటన్న అభిప్రాయం కల్పిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. అన్ని బేరీజు వేసుకునే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని.. విమర్శలు వస్తాయని ఆయన తగ్గే రకం కాదని అంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి… కుల సమీకరణాలు చేపట్టడానికి అంతర్గత ప్రయత్నాల కన్నా బహిరంగ ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారు. అయితే ఈ కులాభిమానం వల్ల ఇతరులు దూరం అయితే.. కాంగ్రెస్‌కు పుట్టగతులుండవన్న వాదన వినిపిస్తోంది.