రేవంత్ రెడ్డి ఒంటరిపోరు…మునుగోడులో కాంగ్రెస్ సై

By KTV Telugu On 6 August, 2022
image

అందరి వేళ్లు…ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డివైపే చూపిస్తున్నాయ్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు… పీసీసీ అధ్యక్షుడ్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తే…ఆ తర్వాత…మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణలు…అదే స్థాయిలో రెచ్చిపోయారు. ప్రత్యర్థులను కౌంటర్ అటాక్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. పీసీసీ చీఫ్ కు మద్దతుగా ఒక్కరు మాట్లాడకపోవడం…కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని సీనియర్ నేతలంతా…రేవంత్ రెడ్డిని ఒంటరి వాడ్ని చేశారన్న చర్చ జోరుగా నడుస్తోంది.

మునుగోడు చుట్టే…తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయ్. అన్ని పార్టీలు మునుగోడు కేంద్రంగా చేసుకుంటున్నాయ్. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి….ఎమ్మెల్యే పదవికి, హస్తం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవరూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయరంటూ రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను దోచుకోవడానికి…పార్టీ హైకమాండ్ కు డబ్బులిచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని తెచ్చుకున్నారంటూ ఆరోపించారు. తాను ఏనాడూ సోనియా గాంధీని విమర్శించలేదంటూ…రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నపుడు సోనియాను విమర్శించిన కామెంట్లను మీడియాకు వినిపించారు. అటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ సైతం….రేవంత్ రెడ్డే లక్ష్యంగా మాటలతూటాలు పేల్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తామన్నా…మంత్రి పదవి ఆఫర్ చేసినా…రాజగోపాల్ రెడ్డి మాత్రం లొంగలేదన్నారు. కేసీఆర పై పోరాటం చేయకుండా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించగానే…రేవంత్ రెడ్డి పంచ్ డైలాగ్ లు పేల్చారు. ఏమీ లేని కోమటిరెడ్డి కుటుంబానికి ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి…బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొచ్చిందన్నారు. తల్లిలాంటి సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం…ఈడీ పేరుతో వేధిస్తుంటే…రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎంగిలి మెతుకుల కోసం బీజేపీలో చేరుతున్నారంటూ విమర్శించారు. మునుగోడులో పార్టీని మోహరించి…రాజగోపాల్ రెడ్డిని ఒడిస్తామంటూ సవాల్ విసిరారు. సమస్యలు ఉంటే నాయకత్వంతో మాట్లాడుకోవాల్సింది పోయి…బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా తీసుకోవాలో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించినా… ఒకరు కూడా డిఫెండ్ చేయలేకపోయారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా సెలైంట్ అయిపోయారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించి…ద్రోహం చేసి వెళ్లిపోతున్న రాజగోపాల్ రెడ్డిని…సీనియర్లు ఒక మాట అనలేకపోయారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తిప్పికొట్టకపోవడంతో…జానారెడ్డి, ఉత్తమ్, వెంకటరెడ్డి, వీహెచ్, మధుయాష్కీ లాంటి వారంతా…ఎవరికి మద్దతిస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంలో…కాంగ్రెస్ సీనియర్లు అట్టర్ ప్లాప్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడ్ని బ్లాక్ మెయిలర్ అంటున్నా…తిప్పికొట్టకుండా పరోక్షంగా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేశారన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోంది. పార్టీ నేతలంతా ఇలాగే కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికే కాదు…బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి వారిపై ఎదురుదాడి చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే…మునుగోడు ఉప ఎన్నికల్లో అయినా కలిసి పని చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏకతాటిపైకి వస్తారో లేదో చూడాలి.