1. తెలంగాణతో కేసీఆర్ బంధం తెగిపోయిందన్న బీజేపీ
2. ఉద్యమకారుల ఊసే ఉండొద్దని కేసీఆర్ కుట్ర అన్న కాంగ్రెస్
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆదిపురుష్‌తో పోలుస్తూ రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన మరుక్షణమే ఆర్జీవి ఈ ట్వీట్ చేశారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ఆదిపురుష్‌గా కేసీఆర్ నిలిచారని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రయోగం చేసిన తొలి నేతగా కేసీఆర్ నిలిచారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీలు స్పందించాయి. బీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణతో కేసీఆర్ కు సంబంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజానీకానికి ఉన్న అనుబంధం ముగిసిపోయిందని, తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను కూడా మర్చిపోయేలా, పూర్తిగా కేసీఆర్ ముద్ర మాత్రమే ఉండేలా పార్టీని స్థాపించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలను నడపాలని పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు.