మూడో వన్డేలోనూ పంత్ విఫలం
లక్ష్మణ్ వివరణపై శశిథరూర్ ఫైర్
వైట్ బాల్ నుంచి విశ్రాంతి ఇవ్వాలన్న థరూర్
భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై సెలెక్టర్లకి ఎందుకంత కోపం. తరచూ ఎందుకు అతన్ని బెంచ్‌కి పరిమితం చేస్తున్నారు. పనికిరాని పంత్ లాంటి ఆటగాళ్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. బీసీసీఐ తీరుపై నెటిజన్లు మళ్లీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. శాంసన్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 36 పరుగులు చేసిన సంజూను రెండో వన్డేలో పక్కనపెట్టేశారు. ఇక మూడో వన్డేలోనూ తుది జట్టులోకి తీసుకోలేదు.
సంజూకి అవకాశం ఇవ్వండి బాబో అని నెత్తి నోరు మొత్తుకుంటున్నా సెలెక్టర్లు పెడచెవిన పెడుతున్నారు. అటు వరుసగా విఫలమవుతున్నా పంత్‌ను మాత్రం తెగ ఆడించేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. మూడో వన్డేలోనూ పంత్ నిరాశ పరిచాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. పంత్ ఇక నువు మారవ్ గానీ రిటైర్ అయిపో అంటూ క్రీడాభిమానులు సూచిస్తున్నారు. అటు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న సెలెక్టర్లపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ మండిపడ్డారు. పంత్ 4వ స్థానంలో బాగా ఆడగలడు. అందుకే అతడిని తీసుకున్నామని వీవీఎస్ లక్ష్మణ్ అంటున్నారు. అయితే అతడు ఫామ్ లేని మంచి ఆటగాడు. గత 11 ఇన్నింగ్స్‌ల్లో పదింటిలో విఫలమయ్యాడు. మరోవైపు సంజూ వన్డే సగటు 66గా ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మంచి పరుగులు చేశాడు. ఇప్పుడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ గణాంకాలు తెలుసుకోండి అని లక్ష్మణ్‌కు థరూర్ సూచించారు. అదేసమయంలో పంత్‌కు వైట్ బాల్ క్రికెట్ నుంచి విశ్రాంతినివ్వాలంటూ మరో ట్వీట్లో స్పందించారు థరూర్.