ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్లే ఉంది బ్రిటన్ పరిస్థితి. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత వచ్చిన కొత్త ప్రధాని నెలన్నరకే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కించే మరో ప్రధానికోసం బ్రిటన్ ఎదురుచూస్తోంది. లిజ్ ట్రస్ రాజీనామాతో కొత్త ప్రధాని కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. బోరిస్ జాన్సన్ తర్వాత రెండునెలలపాటు ప్రతిష్ఠంభన కొనసాగింది. ఆ పరిస్థితిని నివారించేందుకు వారంలోపే కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలనుకుంటోంది కన్జర్వేటివ్ పార్టీ.
లిజ్ ట్రస్ రాజీనామా చేయగానే బ్రిటన్ ప్రధాని ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 650 సీట్లున్న బ్రిటిష్ పార్లమెంటులో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి పోటీపడొచ్చు. గతంలో నామినేషన్ వేయడానికి 20 మంది ఎంపీల మద్దతుంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది పార్టీ ఎంపీల మద్దతుంటేనే పోటీకి అర్హులని ప్రకటించారు. అక్టోబరు 24 మధ్యాహ్నం నామినేషన్ల ప్రక్రియ ముగియగానే ఓటింగ్ మొదలవుతుంది.
రెండుగంటలపాటు సాగే ఓటింగ్‌లో బరిలో ఉన్న ముగ్గురిలో ఎవరికెన్ని ఓట్లొచ్చాయో సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చే అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అత్యధిక ఓట్లు వచ్చిన ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 1,72,000 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆన్‌లైన్ ఓటింగ్‌తో విజేతను ఎంచుకుంటారు. ఈనెల 28న బ్రిటన్ భావి ప్రధాని ఎవరో ప్రకటిస్తారు. ట్రస్‌తో పోటీపడి ఓడిపోయిన రిషీ సునాక్‌కే ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. ట్రస్ నిర్ణయాలు చేటు చేస్తాయని సునాక్ చెప్పినట్లే జరిగింది. దీంతో ఆయనవైపే అత్యధిక ఎంపీలు మొగ్గు చూపుతున్నారు.