రోజా కంట్లో నలుసులా ఆ నలుగురు?

By KTV Telugu On 26 October, 2022
image

వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు నగరిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? ముచ్చటగా మూడోసారి గెలవాలని కలలు కంటున్న రోజాకు అడ్డుతగులుతున్నదెవరు? ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీ నేతలపైనే ఆమె ఎక్కువగా పోరాటం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. రెండుసార్లు వైసీపీ నుంచి నగరిలో గెలిచిన రోజా…మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న రోజాకు.. అసమ్మతి నేతలు సమస్యగా మారారు. నియోజకవర్గంలో తన వ్యతిరేకులంతా ఒకచోట చేరడం రోజాను ఆందోళనకు గురిచేస్తోంది.

నగరిలో 2014, 2019 ఎన్నికల్లో రోజా వరుసగా రెండు సార్లు గెలిచినా.. అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. నియోజకవర్గంలో కమ్మ, క్షత్రియ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి మైనస్ గా మారినా…ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాలు అనుకూలంగా ఉండడం రోజాకు కలిసివస్తోంది. అయితే, అన్నింటి కన్నా ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గ పోరు రోజాకు నిద్ర లేకుండా చేస్తోంది. నిండ్ర మండలానికి చెందిన సీనియర్ నేత చక్రపాణి రెడ్డి, విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతి రాజులతో పాటు కేజీ కుమార్, మురళీ ధర్ రెడ్డిలు రోజా వ్యతిరేక వర్గంలో ఉన్నారు. వీరంతా ఇటీవల సమావేశమై రోజాకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రోజా పంపిన ఓ సందేశం వైరల్ అవుతోంది. పార్టీలో కోవర్టు రాజకీయాలపై పలుమార్లు రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఓసారి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇలా ఉంటే రాజకీయాలు చేయలేమంటూ తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.

గత ఎన్నికల్లో వీరంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు రోజాకు మద్దతుగా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ నేతలంతా వేరు కుంపటి పెట్టినా.. పరోక్షంగా ఇతర పార్టీలకు సహకరించినా రోజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. కానీ, ఇక్కడ రోజాకు మరో అడ్వాన్టేజ్ ఉంది. సొంతపార్టీల నుంచి వ్యతిరేకత ఉన్నా ప్రత్యర్థి పార్టీలో వర్గపోరు ఆమెకు ప్లస్ అవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన భాను ప్రకాష్..నగరిలో మరోసారి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన దూకుడుగా ఉండరని, పార్టీ నేతలను కలుపుకొని వెళ్లరనే ఆరోపణలున్నాయి. అంతకుమించి సొంత తమ్ముడు జగదీప్ ప్రకాష్ తో విభేదాలు భాను ప్రకాష్ కు మైనస్ అవుతోంది. ఇది రోజాకు కలిసి వచ్చే అంశం. మొత్తంగా రెండు పార్టీల్లోని వర్గపోరే.. నగరిలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది.