– కాలంతో పాటే మార్పు..ఆర్‌ఎస్‌ఎస్ కొత్త కూర్పు!
నిజమేనా అంటే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థం. ఆ మాట ఆ సంఘ పెద్దల నోటినుంచే రావాలి. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ కొత్త రూపం సంతరించుకునే దిశగా అడుగులేస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటిదాకా తన కార్యకలాపాల్లో మహిళలను దూరంపెట్టిన సంఘ్ లేడీస్ ఫస్ట్ అనబోతోంది. చరిత్రను తిరగరాయాలనుకుంటోంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహిళలకు కీలక పదవులు కట్టబెట్టే ఆలోచనతో ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలు సంఘ్‌లో మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. సంఘ్‌లో కీలకమైన సహ కార్యవాహ్, సహ సర్ కార్యవాహ్ బాధ్యతలు మహిళలకు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 2025కల్లా ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే సంఘ్ రూపురేఖలు మారబోతున్నాయంటున్నారు.
97ఏళ్ల సంఘ్ చరిత్రలో ఇప్పటిదాకా మహిళలెవరూ అత్యున్నత పదవి చేపట్టలేదు. దానికి స్వస్తిపలికి మహిళలకు కీలక బాధ్యతలు ఇచ్చే దిశగా సంఘ్ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుబంధ సంస్థ రాష్ట్ర సేవికా సమితిలో పనిచేస్తున్న మహిళలను సంఘ్‌లోకి తీసుకోవాలనే ఆలోచన జరుగుతోంది. ఇందులో భాగంగానే నాగ్‌పూర్‌లో విజయదశమి వేడుకలకు పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారని సమాచారం.
ఆర్‌ఎస్‌ఎస్ తొలిసారి ఓ మహిళను చీఫ్‌గెస్ట్‌గా ఆహ్వానించటం ఇంటా బయటా చర్చనీయాంశమైంది. సర్ సంఘ్‌చాలక్ పదవిని ఓ మహిళకు ఇస్తారా అంటూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. ఓ చిరుత పులి తన శరీరంమీదుండే మచ్చలను మార్చుకోగలుగుతుందా అని డిగ్గీరాజా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పులి మచ్చలు మార్చుకోలేదోగానీ తన భావజాలానికి అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్ అనూహ్యమార్పులకు సిద్ధపడితే ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు.