కండలవీరుడికి మహారాష్ట్ర వై ప్లస్ సెక్యూరిటీ
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది. సల్మాన్‌హత్యకు కుట్ర జరిగిందనే వార్తలతో ఆయన అభిమానులే కాకుండా అంతా ఉలిక్కిపడ్డారు. కేవలం అనుమానం కాదు. సల్మాన్ లక్ష్యంగా గ్యాంగ్‌స్టర్లు రెక్కీ కూడా నిర్వహించారు. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలాని హతమార్చిన నిందితులే సల్మాన్ మర్డర్‌కి కూడా స్కెచ్చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కనుసన్నల్లో జరిగిన ఈ కుట్ర బయటికి రావటంతో కండలవీరుడికి పోలీసులు సెక్యూరిటీ పెంచారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో కొందరు ప్రముఖులున్నారు. వారిలో సల్మాన్‌ఖానే కీలక టార్గెట్. ముంబైలో సల్మాన్ ఇంటిదగ్గర మూడురోజులు రెక్కీ కూడా నిర్వహించారు. అవకాశం దొరకలేదుగానీ లేకపోతే ఈపాటికి సల్మాన్‌మీద ఎటాక్ జరిగి ఉండేదే. గ్యాంగ్‌స్టర్‌ల కుట్ర గురించి సల్మాన్‌ని అలర్ట్ చేసిన పోలీసులు చివరికి ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. సల్మాన్‌ఖాన్‌తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు కూడా అదే కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిఘావర్గాల సమాచారంతో ప్రస్తుతం సల్మాన్‌కు ఉన్న ఎక్స్ గ్రేడ్ భద్రతను ప్రభుత్వం వై ప్లస్‌కి పెంచింది. మరో నటుడు అక్షయ్‌కుమార్‌కు వై కేటగిరీ భద్రత కల్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలకు Y + భద్రతను కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల మహావికాస్ అఘాడీ నాయకులు 25 మందికి కేటగిరైజ్డ్ భద్రతను తొలగించిన ప్రభుత్వం ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యేలను మాత్రం కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతోంది.