సమంతాకు మయోసైటిస్.. ఆ జబ్బు ఎందుకొస్తుంది?
పాపం..మొగుడూ పెళ్లాలు మనస్ఫూర్తిగా విడిపోయినా నిందలు మాత్రం తనపైనే. నాగచైతన్యని ఏ ఒక్కరూ ఒక్క మాట అనలేదు. అంతా సమంతనే ఆడిపోసుకున్నారు. అప్పుడప్పుడూ పొయిటిక్‌గా తనలోని బాధని చెప్పటం, భవిష్యత్తుపై సంకేతాలివ్వడం తప్ప ఒంటరి బతుకుతో ఆ హీరోయిన్ బావుకుంటున్నదేమీ లేదు. సడెన్‌గా తను చేసిన ట్వీట్‌తో పాపం అంటూ తొలిసారి అంతా ఆమెమీద సానుభూతి చూపిస్తున్నారు. తను మయోసైటిస్‌తో బాధపడుతున్నానంటూ సమంత చెప్పటంతో తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నా. మీ అందరి ప్రేమ ఇచ్చిన ధైర్యంతో ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటున్నా. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నా అంటూ సమంతా ఎమోషనల్ ట్వీట్ పెట్టింది. కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధి సోకిందంటూ విషయాన్ని కాస్త ఆలస్యంగా పంచుకుంటున్నాని చెప్పింది. ఈ సమస్య నుంచి నేను బయటపడతానంటూ లవ్ ఎమోజీని సింబాలిక్‌గా పెట్టటంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. తారక్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడూ వినని ఈ వింత జబ్బు ఏమిటని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారంతా.
మయోసైటిస్ అరుదైన వ్యాధి. కండరాలకు సంబంధించిన ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బంది వ్యాధి ప్రాథమిక లక్షణాలు. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టమే. మయోసైటిస్‌లో ఐదు రకాలున్నాయి. పాలీ మయోసైటిస్ బారినపడే వారు చిన్నచిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. డెర్మటో మయోసైటిస్‌తో చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్‌తో నీరసంతో పాటు కండరాలు పట్టేసి బాధపెడతాయి.
మయోసైటిస్ కండరాలపై దాడి చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందనే కారణాన్ని కూడా అంత తేలిగ్గా తెలుసుకోలేం. ఈ వ్యాధి సోకడంలో గాయం, ఇన్ఫెక్షన్ వంటివి కీలక కారణాలని చెబుతారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, జలుబు, ఫ్లూ, హెచ్ఐవీ వంటి వైరస్‌లతో పాటు విషపూరిత ఔషధాలతో ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయి. ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివాటితో ఉపశమనం దొరుకుతుంది. అమెరికాలో ఏటా కొత్తగా 1,600 నుంచి 3,200దాకా మయోసైటిస్ కేసులు నమోదవుతుంటాయి. ఇప్పుడు సమంతాకి ఈ కష్టమొచ్చింది. బాలీవుడ్‌లో దుమ్మురేపాలనుకుంటున్న టైంలో ఆరోగ్యసమస్య వచ్చిపడింది.