మళ్లీ సేన-బీజేపీ దోస్తీ! షిండే బకరానేనా?

By KTV Telugu On 10 November, 2022
image

పాతబంధాన్ని మళ్లీ కలిపేది ఈ ‘రౌతే’నా?

సంజయ్‌రౌత్‌. బుల్లెట్‌ కూడా చిన్నగానే ఉంటుందన్నట్లు కటౌట్‌. శకునిమామతో పోల్చలేంగానీ రాజకీయాల్లో చాణక్యనీతి ఉన్న నాయకుడు. బాల్‌థాక్రే తర్వాత ఉద్దవ్‌థాక్రే నాయకత్వంలోని శివసేనకు ఆయనే కీలక లీడర్‌. శివసేన తరపున మీడియా ముందు ఎప్పుడూ కనిపించే స్పోక్స్‌ పర్సన్‌ సంజయ్‌రౌతే. అలాంటి సంజయ్‌రౌత్‌కి కూడా రాజపూజ్యంతో పాటు అవమానాలు తప్పలేదు. ఎప్పుడైతే షిండే శివసేనని చీల్చి ఉద్దవ్‌ సర్కారుని దించేశాడో సంజయ్‌రౌత్‌కి కూడా బ్యాడ్‌టైమ్‌ వచ్చేసింది. సీన్‌ కట్‌ చేస్తే ఈడీనుంచి తాఖీదులు, అరెస్టు, జైలు అన్నీ స్పీడ్‌గా జరిగిపోయాయి.
వందరోజుల జీవితం కొత్త పాఠాలు చెప్పిందో, గుణపాఠం నేర్పిందోగానీ బయటికి వచ్చీరాగానే సంజయ్‌రౌత్‌ స్వరం మారింది. ఎన్ని కక్షసాధింపు చర్యలకు దిగినా బీజేపీకి తలొగ్గనని చెప్పిన సంజయ్‌ ఇప్పుడు పీఛేముడ్‌ అంటున్నాడు. తన పెద్దరికానికి ఎసరుపెట్టిన ఏక్‌నాథ్‌షిండేని పొగిడేస్తున్నాడు. ఫడ్నవీస్‌ని ప్రశంసిస్తున్నాడు. మొత్తం వ్యవస్థని, ఏ కేంద్రసంస్థనీ నిందించనంటూ కాళ్లబేరానికి వస్తున్నాడు. అంతేకాదు త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, అమిత్‌షాను కలిసేందుకు సిద్ధమవుతున్నాడు.

మూడ్నెల్లు జైల్లో వేస్తే ఇంత మార్పా? సంజయ్‌రౌత్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, లేకపోతే ఉద్దవ్‌థాక్రే మనసులోని మాటేనా? మళ్లీ బీజేపీతో ఫ్రెండ్‌షిప్‌ ప్రయత్నాల్లో శివసేన(థాక్రే వర్గం) ఉందా? కమల నాయకత్వం కూడా అదే కోరుకుంటోందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎప్పుడూ ఉండరు. బీజేపీతో శివసేనకు శత్రుత్వమేమీ లేదు.స్నేహం కాస్త చెడిందంతే. దాన్ని రిపేరు చేసి స్నేహాన్ని మళ్లీ పట్టాలెక్కించే బాధ్యతని రౌత్‌కి అప్పగించినట్లుంది. జైలుకెళ్లేదాకా శివమెత్తినట్లు చిందులు తొక్కిన రౌత్‌ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకోవడంతో అందరికీ ఎన్నో డౌట్స్‌.
మహారాష్ట్ర రాజకీయం కొన్నాళ్లుగా ఊహించని మలుపులు తిరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనిశ్చితి కొనసాగుతోంది. ఏ పార్టీ ఎటు వెళ్తుందో, ఏ నాయకుడు ఎప్పుడు గోడ దూకుతాడో అర్ధంకావడంలేదు. బీజేపీతో కలిసి పోటీ చేసి తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీతో కలిసి అధికారపగ్గాలు చేపట్టారు శివసేన చీలికవర్గ నేత ఏక్‌నాథ్‌షిండే. వచ్చే సాధారణ ఎన్నికల్లో శివసేన ఒక్కటిగా ఉండి తమ వెంట ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. సంజయ్‌రౌత్‌ సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. పాపం మధ్యలో షిండేనే బకరా అయ్యేలా ఉన్నాడు.