సిసోడియాను వ‌ద‌ల‌నంటున్న స్కామ్‌

By KTV Telugu On 25 October, 2022
image

ఆ కంపులేదంటున్నా గుప్పుమంటూనే ఉంది!

నా చేతుల‌కు అవినీతి మ‌ర‌క‌లు అంట‌లేద‌న్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా. మా సిసోడియా నిప్పు..చెద ప‌ట్టే అవ‌కాశ‌మే లేద‌న్నారు కేజ్రీవాల్‌. కానీ లిక్క‌ర్‌స్కామ్ మాత్రం దేశ‌మంతా తిరిగి సిసోడియా చుట్టే కేంద్రీకృత‌మ‌వుతోంది. వ‌ద‌ల మ‌నీషా వ‌ద‌లా..అంటూ ఢిల్లీ ఆప్ స‌ర్కారు కీల‌క లీడ‌ర్‌ని చిక్కుల్లో ప‌డేస్తోంది. మొన్న‌టిదాకా ఎక్క‌డెక్క‌డో సోదాలు, త‌నిఖీలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో అరెస్టులు కూడా అయ్యాయి. ఇంకా కొంద‌రు పెద్ద‌మ‌నుషులు సీబీఐ ఉచ్చులో చిక్కుకోక త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకి సీబీఐ నోటీసులిచ్చింది.

గ‌తంలో సీబీఐ అధికారులు సిసోడియా నివాసంలో సోదాలు నిర్వ‌హించారు. లాక‌ర్ల‌ను త‌నిఖీచేశారు. పాపం అంత క‌ష్ట‌ప‌డ్డా వారికి ఏమీ దొర‌క‌లేద‌ని డిప్యూటీ సీఎం త‌న స‌చ్చీల‌త‌ను నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఇప్పుడు సీబీఐ శ్రీముఖంతో ఆ డిపార్ట్‌మెంట్ హెడ్‌క్వార్ట‌ర్‌కి వెళ్తున్నారు. క‌బురొచ్చింది. త‌ప్ప‌కుండా వెళ్తా. అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం ఇస్తానంటున్నారు సిసోడియా. కానీ లోప‌ల‌మాత్రం ప్రాణం బిక్కుబిక్కుమంటూనే ఉంది. కొండ‌ని త‌వ్విన సీబీఐ ఎలుక‌ని ప‌ట్టినా అది త‌న‌దేనంటారేమోన‌ని ఆప్ నేత టెన్ష‌న్ ప‌డుతున్నారు.

లిక్క‌ర్ స్కామ్‌లో 14వ నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్ళైకు కూడా సీబీఐ నోటీసులిచ్చింది. ఏకకాలంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, ఇటు రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్, రాబిన్ డిస్టిల‌రీ డైరెక్టర్ రామచంద్రన్ పిళ్ళైను వేర్వేరుగా విచారణకు పిల‌వ‌టంతో స్కామ్ ఎంక్వ‌యిరీ క్లైమాక్స్‌కి వ‌స్తున్న‌ట్లే ఉంది. త‌మ క‌స్ట‌డీలో బోయిన్‌పల్లి అభిషేక్‌రావును సీబీఐ ఐదు రోజులు ప్ర‌శ్నించి అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇప్పుడు సిసోడియా, పిళ్ళైల‌ను విచారణకు పిల‌వ‌టంతో కేవ‌లం ప్ర‌శ్నించి పంపిచేస్తారా లేదంటే మ‌రో అడుగు ముందుకేస్తారా అన్న చ‌ర్చ న‌డుస్తోంది.