పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఆలోచనలకు తెరతీశాయి. ముఖ్యమంత్రి కావాలన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరిక తీరకపోగా ఓడిపోయి ఎమ్మెల్యే పదవి కూడా పోయింది. కాంగ్రెస్ లో చేరాలనుకుని వెనక్కి తగ్గిన ప్రశాంత్ కిషోర్…. ఇప్పుడు కాలిబాట పడుతున్నారు. ఆ ఇద్దరు ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఇద్దరూ పావులు కదుపుతున్నారు..
సిద్ధూ క్లీన్ బౌల్డ్
పంజాబ్ పాలిటిక్స్‌లో క్లీన్ బౌల్డ్ అయిన క్రికెటర్, పాలిటీషియన్ సిద్ధూ కొత్త మార్గాలు వెదుకుతున్నారు. సోనియా కుటుంబం మొహం చాటెయ్యడంతో సరికొత్త రాజకీయ సమీకరణల కోసం ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చేతులు కలిపేందుకు సిద్ధూ పావులు కదుపుతున్నారు. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీని దువ్వుతూనే మరో పక్క పీకే స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒక సారి పీకేతో లాంఛనంగా సమావేశమైన నవజ్యోత్ సింగ్.. తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు. మనం మనం బరంపురం అన్నట్లుగా.. కలిసిపోయే ప్రయత్నంలో ఉన్నారు.
వార్తల్లో వ్యక్తిగా కొనసాగడమెలాగో సిద్ధూకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. నిన్నగాక మొన్న ఎన్నికల్లో ఓడిపోయే వరకు కూడా ప్రతీ రోజు ఏదోక స్టేట్ మెంట్‌తో కాంగ్రెస్ అధిష్టానాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. సంయమనం పాటించాలని ఎన్ని సందేశాలు పంపినా.. సిద్ధూ ఒక్క సారి కూడా లెక్కచేయలేదు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదన్న అక్కసుతో అప్పటి సీఎం చన్నీకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇస్తూ రాష్ట్ర పార్టీని కూడా ఇబ్బంది పెట్టారు. చివరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. 117 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ కు 18 మాత్రమే వచ్చాయి. అమృత్‌సర్ నియోజకవర్గంలో సిద్ధూ ఘోరంగా ఓడిపోయారు. అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పద్ధతి మార్చుకుంటారా అంటే ఆ పనిచేయలేదు. నిజాయితీ గెలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికెత్తేశారు. ఆప్ తాజా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను తెగ పొగిడేశారు. ఇంకేముంది సిద్ధూ .. త్వరలో ఆప్ తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ మొదలైంది. దానితో కాంగ్రెస్ అధిష్టానానికి చిర్రెత్తుకొచ్చింది పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని సిద్ధూను ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు సిద్ధూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ గాంధీ గానీ, ఆయన సహాయకులు గానీ స్పందించలేదు. దానితో సిద్ధూకు బాగా కోపం వచ్చినట్లుంది.
పాదయాత్రకు ప్లాన్
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త. తన ఐ ప్యాక్ సంస్థ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు పనిచేశారు. దక్షిణాదిన డీఎంకే, వైసీపీ ఇప్పుడు టీఆర్‌ఎస్ కు వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తరాదిన కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ ఇలా అనేక పార్టీల విజయానికి సహాయ పడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బ్లూ ప్రింట్ సమర్పించారు. 600 స్లైడ్స్‌తో ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలని కూడా పీకేను సోనియా ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ మాత్రం ఆయనకు నచ్చలేదు. వ్యూహబృందంలో ఉండాలన్న ప్రతిపాదనని ఆయన ఆమోదించలేకపోయారు. ఇండిపెండెంట్‌గా పనిచేసేందుకు కాంగ్రెస్ నుంచి హామీ పొందాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దానితో పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లు ట్వీట్ చేసి మళ్లీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు రూటు మార్చి… బిహార్ ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. గాంధీ జయంతిన ప్రారంభమయ్యే పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు సాగుతుందని వెల్లడించారు. 18 వేల మంది తటస్థులు తను సమయానుకూలంగా చర్చించి… భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటానని భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని పీకే చెప్పుకొచ్చారు.
అనివార్యత వారిద్దరినీ కలుపుతోందా…?
అటూ పీకే, ఇటు సిద్ధూ ఇప్పుడు రాజకీయ నీడ లేని వ్యక్తులే. స్వతంత్రంగా వ్యవహరిస్తూ తమ సత్తా చాటాలనుకుంటున్న నేతలే. సంప్రదాయ పార్టీల్లో లోపాలను వేలెత్తి చూపుతూ.. తమకు అవకాశం ఇస్తే మట్టిని బంగారం చేస్తామని హామీ పలికే రాజకీయ ఔత్సాహికులే. కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని పీకే ప్రకటించిన తర్వాతే సిద్ధూ ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేయడం, ఆయనతో భేటీ కావడం జరిగింది. పీకేకు కూడా ఒక పేరున్న మిత్రుడు అవసరం కావడంతో సిద్ధూ చేయి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ప్రశాంతి కిషోర్ పార్టీ పెడితే బడానేతలు వచ్చి చేరతారన్న నమ్మకం లేదు. ఎవరైనా మద్దతిస్తారన్న విశ్వాసం లేదా. అలా ఎవరైనా రావాలంటే ముందు ఒకరిద్దరైనా తనతో చేతులు కలపాలి. అందుకే పీకే తన రాజకీయ స్నేహితుడిగా సిద్ధూని ఎంపిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సిద్ధూ ఒక పక్క ఆప్‌కు గాలం వేస్తున్నారు. అయితే ఆప్ నేతలు తనను కలుపుకుంటారన్న నమ్మకం లేదు. దానితో రాజకీయ మనుగడ కోసం సిద్ధూ కొత్త మార్గాలు వెదుక్కోక తప్పడం లేదు. పీకే అతనికి ఎడారిలో ఒయాసిస్‌లా కనిపిస్తున్నారు. సిద్ధూ ఎప్పటికైనా కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సిన నాయకుడే.అందుకే పీకే, సిద్ధూ కలిసే అవకాశాలు బలపడుతున్నాయి.