సీమ బిడ్డ. మంచి గాయని. ఇంకేం కావాలి?
ప్రతీదీ వివాదమే. ప్రతి నిర్ణయాన్నీ తప్పుపట్టడమే. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరన్నట్లే ఉంటోంది కొన్ని సందర్భాల్లో విపక్షపార్టీల వ్యవహారశైలి. రాయలసీమలో పుట్టి తెలంగాణలోనూ పేరొందిన సింగర్‌కి పదవి ఇస్తే దానిపైనా ట్రోలింగ్ నడిచింది. ప్రముఖ గాయని మంగ్లీని ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌కు సలహాదారుగా నియమించింది. ఇంకేముందీ టీడీపీకి మేత దొరికింది. మంగ్లీకి ఏస్వీబీసీ సలహాదారు పదవి ఏంటంటూ టార్గెట్ చేసుకుంది.
మంగ్లీ పల్లెపాటలనుంచి సిన్మా పాటలదాకా ఎన్నో పాడింది. భక్తి పాటల్లోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది. పాటే ఆమె జీవనోపాధి. రాజకీయనాయకులకు కూడా ఆమె ప్రొఫెషనల్‌గా పాటలు పాడింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిమీద రాసిన రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న పాట మంగ్లీ పాడిందే. ఆమెకు ఎస్వీబీసీ పదవి ఆ అభిమానంతోనే ఇచ్చారంటోంది టీడీపీ. మంగ్లీ రుణం తీర్చుకోడానికే పదవి ఇచ్చారని ఆ పార్టీ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోసింది. సింగర్‌గా రెమ్యునరేషన్ తీసుకుని పాడిన పాటకు రుణం తీర్చుకునేదేముంటుంది?
టీడీపీ కోపం మంగ్లీ మీద కాదు. జగన్‌కి ఎంతో హైప్ తెచ్చిన రాయలసీమ ముద్దుబిడ్డ పాటమీద. ఎన్నికల ప్రచారంలో ఆ పాట పల్లెల్ని ఊపేసింది. వైసీపీకి క్రెడిట్ తీసుకొచ్చిన పాట పాడినందుకు గాయనిమీద గుర్రుమనడంలో ఔచిత్యముందా? అందుకే టీడీపీకి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. బొడ్డుపాటలు, పండ్లతో రొమాన్స్ సీన్లు తీసిన రాఘవేంద్రరావుకి టీడీపీ అధికారంలో ఉండగా ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి ఇచ్చారు. దర్శకేంద్రుడికి పదవిస్తే రైటు. సీమ గిరిజనబిడ్డకు గుర్తింపు ఇస్తే రాంగా అంటూ రివర్స్ కౌంటర్లతో విమర్శకులు డిఫెన్స్‌లో పడుతున్నారు. ఎదుటివాళ్లకు ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్లు మనకేసి చూపిస్తాయని పెద్దోళ్లు చెప్పేది అందుకే.