పొగాకు ఉత్పత్తులపై నిషేధం సాధ్యమా.. న్యూజిలాండ్ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా… చట్టాలతో ప్రయోజనం ఉంటుందా… ధూమపానం ఆపేస్తే కలిగే ప్రయోజనాలేమిటి….
ధూమపానం ప్రపంచ మానవాళిని మహమ్మారిలా పట్టి పీడిస్తోంది. రోజు కొన్ని లక్షల మంది పొగాకు సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. పొగాకు వల్ల కేన్సర్ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనితో చిన్నదేశమైనప్పటికీ న్యూజిలాండ్ పెద్ద నిర్ణయమే తీసుకుంది. స్టేటస్ సింబల్ గా భావిస్తూ సిగిరెట్లు తాగుతున్న యువతను కాపాడుకునేందుకు కొత్త చట్టాన్ని అమలు చేయబోతోంది. రెండు మూడు సంవత్సరాలుగా దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు న్యూజిలాండ్ పార్లమెంటులో బిల్లు రూపంలో కార్యాచరణ ప్రారంభమైంది. 2023 నాటికి బిల్లు పాస్ అవుతుందని పార్లమెంట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం అమలైతే 2009 లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదు. పైగా ఇలాంటి చట్టం తీసుకొస్తున్న తొలి దేశం కూడా న్యూజిలాండే అవుతుంది….
పొగాకుపై బ్యాన్ విధించాలని న్యూజిలాండ్ ఆలోచిస్తున్న తరుణంలోనే ఆసియా దేశం మలేషియాలో కూడా చర్చ మొదలైంది. అక్కడ టీనేజర్లకు సిగిరెట్లు విక్రయించకుండా పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. 2007 తర్వాత పుట్టిన వారికి ఈ సిగిరెట్లు కూడా విక్రయించకూడదు. ఆగస్టు 4 లోపు అంటే… న్యూజిలాండ్ కంటే చాలా ముందే మలేషియాలో చట్టం రాబోతోంది. ఇక 2045 నాటికి దేశంలో ఎవరికీ, ఎటువంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా చూడటమే న్యూజిలాేండ్ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలపై విపక్షాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనంలో సరైన అవగాహన లేకుండా చట్టాలు తెస్తే ప్రయోజనం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. జనంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలని వాదిస్తున్నారు…
మలేషియాలో పొగాకు వాడకంతో ప్రతీ ఏడాది 25 వేల మంది చనిపోతున్నారు. భారత్‌లో అలాంటి మరణాలు ఏడాదికి 14 లక్షల వరకు ఉంటుంది. చిన్నదేశాలైనా మలేషియా, న్యూజిలాండ్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. న్యూజిలాండ్‌లో ఏటా రెండు నుంచి మూడు వేల మంది చనిపోతుండగా. ఆ సంఖ్యను సున్నా స్థాయికి తెచ్చేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించబోతున్నారు. సిగిరెట్లలో నికోటిన్ శాతాన్ని పూర్తిగా తగ్గించిన పక్షంలో ఆ అలవాటును తగ్గించే వీలుందని అంచనా వేసుకుంటున్నారు. సిగిరెట్ షాపుల సంఖ్య కూడా 90 నుంచి 95 శాతం వరకు తగ్గించే చర్యలు తీసుకుంటారు. అప్పుడు త్వరగా అందుబాటులో లేకుండా చూసుకునే వీలుంటుంది….
సిగిరెట్లను బ్యాన్ చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది. అయినా ఫర్వాలేదంటోందీ న్యూజిలాండ్ ప్రభుత్వం. ధూమపానం మాన్పించెయ్యగలిగితే.. ఆరోగ్యం మెరుగుపడి జనంలో పని సమర్థత పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగోలేదంటూ పెట్టే సెలవులు తగ్గుతాయి. ఎక్కువ సమయం పనిచేసి జాతీయాదాయం పెంచిన వారవుతారు. న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రజా వైద్యానికి వ్యయం చేసే దానిలో కనీసం పదివేల కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఆ చెడు అలవాటు మానుకుంటే.. ప్రతీ కుటుంబంలో పొదుపు పెరుగుతుంది. వినియోగ వస్తువులు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది… వృధా వ్యయం తగ్గి ఉత్పాదక వ్యయంపై దృష్టి పెడతారు. మరి ఇప్పటికైనా న్యూజిలాండ్ లాంటి దేశాలను చూసి భారత ప్రభుత్వం కూడా ఆచరిస్తే బావుంటుంది….