ఏ క్షణమైనా మీ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. ప్రపంచంలోని మొబైల్ ఫోన్లన్నీ మూగబోతాయి ఏటీఎంలు ఆగిపోతాయి. ఆన్లైన్ లావాదేవీలన్నీ స్తంభిస్తాయి. మీ ఇంటర్నెట్ కూడా ఆగిపోతుంది. అదే ఆగిపోయాక ఇక ఫేస్‌బుక్‌కు లేదు వాట్సాప్ కూడా ఉండదు. ఆడియో వీడియో ఏ కాల్ కూడా కలవదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయిపోతాయి. తలుచుకుంటేనే అమ్మో ఇంకేమన్నా ఉందా అనిపిస్తోంది కదూ. ఏమో ఇది జరిగినా జరగొచ్చు.
కరోనా పీడనే ఇంకా వదల్లేదు. అంత తేలిగ్గా వదిలిపెట్టనంటూ ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇంకా భయపెడుతూనే ఉంది మహమ్మారి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరో షాకింగ్ న్యూస్ చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంటర్నెట్కు సౌర తుఫాన్ ముప్పు ఉందన్న సైంటిస్టుల తాజా వార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
అంతరిక్షంనుంచి పొంచి ఉన్న మరో ముప్పుతో ఆధునిక ప్రపంచం స్తంభించబోతోందన్న ప్రచారం అందరినీ భయపెడుతోంది. ప్రస్తుతం మనం ఉపయోగించే అత్యాధునిక ఆన్లైన్ టెక్నాలజీ అంతా అంతరిక్షంలో భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల ద్వారానే అందుతుంది. శాటిలైట్స్‌తో పాటు ఆన్లైన్ సేవలకు ఇంటర్నెట్ కీలకం. అయితే ఇప్పుడు ఆ ఉపగ్రహాలకు సముద్ర అంతర్భాగం నుంచి వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్‌కు కూడా సౌర తుఫానుతో పెను ముప్పు పొంచి ఉందంటున్నారు. ఈ భూమండలానికి సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు జీవకోటి మనుగడపై ప్రభావం చూపుతుంది. సూర్యుడిపై సర్వ సాధారణంగా సంభవించే సౌర తుఫాన్లు భూమిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ సిస్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. 1859 1921లో సౌర తుఫాన్లతో భూమిపై కొంత ప్రభావం పడింది. 1989లో భూమిని తాకిన సౌర తుఫాన్ దెబ్బకు రేడియోలు మూగబోయాయి. ఈ ఏడాది జులైలో భూమికి సౌర తుపాను ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఒకవేళ ఇప్పుడు సౌర తుఫాన్ సంభవిస్తే మాత్రం శాటిలైట్స్‌తో పాటు ఇంటర్నెట్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర అంతర్భాగం గుండా విస్తరించి ఉన్న కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. జీపీఎస్ వ్యవస్థ ఆగిపోతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులుంటుంది యథాస్థితికి ఎన్నిరోజుల్లో వస్తుందన్నదానిపై ఇప్పుడే అంచనాకి రాలేమంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిపై సౌర తుఫాన్ ఎఫెక్ట్ పడితే మాత్రం ఆసియా దేశాలకు తక్కువ డ్యామేజ్ ఉండొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండటంతో పెద్దగా ప్రభావం ఉండదన్న అంచనాతో మనం కాస్త ఊపిరిపీల్చుకోవచ్చు. అయితే అట్లాంటిక్ ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుఫానుతో ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. సాంకేతికంగా మనం ఆకాశాన్ని చుంబిస్తున్నా ప్రకృతి ప్రకోపిస్తే మన చేతుల్లో ఏమీ ఉండదన్నమాట.