ముమ్మాటికీ నిజం..ఓడలు బండ్లవుతాయ్!
గాంధీల చేతుల్లోంచి కాంగ్రెస్ బంధవిముక్తం
జనం నమ్మలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలు కలా నిజమా అని గిల్లి చూసుకుంటున్నారు. నెహ్రూనుంచి రాహుల్‌దాకా నాలుగుతరాలనుంచీ గాంధీ కుటుంబపార్టీగా ఉన్న కాంగ్రెస్ దాస్యశృంఖలాల్ని తెంచుకుంటోంది. తొలిసారి గాంధీయేతర కుటుంబం చేతికి నాయకత్వ పగ్గాలు అందుతున్నాయి. మల్లికార్జున్‌ఖర్గేనా, శశిథరూరా లేక మరొకరా అన్నది చర్చే కాదిప్పుడు. దేశాన్ని ఎన్నోదశాబ్దాలపాటు ఏలిన పార్టీలో ఎవరూ ఊహించని, ఎవరి ఊహకీ అందని పరిణామం ఇది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికను ఎన్నికలకమిషన్ ఇటీవల ఆక్షేపించింది. ఈ సమయంలోనే జాతీయపార్టీలో నాయకత్వమార్పు కాకతాళీయమే అయినా కుటుంబవారసత్వానికి కాలం చెల్లిందనేందుకు ఈ పరిణామాలే నిదర్శనం. పార్టీ నాయకత్వాన్ని రాహుల్‌గాంధీ త్యాగం చేయలేదు. ఈ బరువు బాధ్యతల్ని భుజాన మోసేందుకు ఆయన సిద్ధంగా లేరంతే. ప్రియాంకగాంధీని తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నా సోనియాగాంధీ ఆ పనిచేయలేదు. నండిసంద్రంలో చిల్లుపడ్డ పార్టీని బయటి నాయకత్వానికి అప్పగించడం మినహా అధినేత్రికి మరో మార్గంలేదు.
నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా రెండుసార్లు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రాభవం క్షీణిస్తూ ఉంది. నాయకత్వ బాధ్యతల్ని తిరస్కరించిన రాహుల్‌గాంధీ భారత్ జోడో అంటూ పాదయాత్ర చేపట్టి పార్టీకి తానే భావినాయకుడినని చెప్పకనే చెప్పారు. పార్టీలో సీనియర్‌నేతల ధిక్కారస్వరానికి తోడు గులాంనబీ ఆజాద్‌లాంటి సీనియర్ల నిష్క్రమణతో గాంధీ కుటుంబానికి తత్వం బోధపడింది. అందుకే కొత్త కూర్పుతో ఇంతటి విప్లవాత్మక మార్పు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ తమ మద్దతుండదని సోనియాగాంధీ స్పష్టంచేసినా మల్లికార్జునఖర్గే తెరపైకి రావటంలోనే అసలు కథంతా ఉంది. రేసునుంచి రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ తప్పుకున్నాక(తప్పించాక అనొచ్చు) శశిథరూర్ ఒక్కడే ప్రధాన పోటీదారు అనుకున్నారు. మధ్యలో డిగ్గీరాజా పేరు కూడా వినిపించినా ఆయన కూడా సైడైపోయి మల్లికార్జునఖర్గే మై హూనా అంటూ స్క్రీన్‌మీద ప్రత్యక్షమయ్యారు. ఏకగ్రీవానికి అవకాశం లేదు. ఎన్నిక జరుగుతుంది. అందులో ఎవరికి నెగ్గితే వారికే కాంగ్రెస్ పగ్గాలు. ఎవరికీ ప్రత్యక్షమద్దతులేదని చెప్పినా ఖర్గేలాంటి విధేయుడినే గాంధీ కుటుంబం కోరుకుంటుంది. తెరవెనుక ఆయనకోసమే పావులు కదుపుతుంది. గాంధీ కుటుంబం లేకపోతే పార్టీనే లేదననుకునే వీరవిధేయులంతా అధినేత్రి మనసెరిగి మసలుకుంటారు. జీ23లోని మనీశ్ తివారీ, భూపేందర్ హుడాలాంటి నేతలు కూడా ఖర్గే నామినేషన్‌ని ప్రతిపాదించడం చూస్తుంటే కాగలకార్యం గంధర్వులు తీర్చేలా కనిపిస్తోంది.
మరోవైపు శశిథరూర్‌కూడా అల్లాటప్పా లీడరేం కాదు. వంగొంగి దండాలు పెట్టేరకం కాదు. తోలుబొమ్మలా ఎవరన్నా ఆడిస్తే ఆడేరకం అస్సలు కాదు. స్వాభిమానం ఉన్న నాయకుడు. వివాదాస్పదుడైనా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. వయసు 66. మిగిలిన రాజకీయ నాయకులకంటే పూర్తి భిన్నమైన లీడర్. ఉన్నతవిద్యావంతుడు. ఒకప్పుడు యూఎన్‌వో సెక్రెటరీకి సీనియర్ అడ్వైజర్‌గా పనిచేసినవాడు. పదమూడేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. మూడుసార్లు తిరువనంతపురంనుంచి ఎంపీగా గెలిచాడు. ఓ దశలో కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగా విమర్శలు చేసిన శశిథరూర్ ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష రేసులో నిలవడం విచిత్రం. మోడీకంటే ముందు 2013దాకా ట్విట్టర్‌లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పేరొందిన శశిథరూర్‌ని కాంగ్రెస్ గెలవనిస్తుందా? సొంత నిర్ణయాలు తీసుకునే నాయకుడి చేతుల్లోకి పార్టీపగ్గాలు పెట్టనిస్తుందా? అది జరిగేపని కాదు కాబట్టే మంత్రాంగమంతా మల్లికార్జునఖర్గే చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్‌లో అంతేమరి!