మీడియా హడావుడేనా.. అక్కడంత సీన్ లేదా…

By KTV Telugu On 3 June, 2022
image

అబ్బ..అబ్బ… అబ్బ.. అయిపోయింది. ఇక బెంగాల్ సీన్ మారిపోయింది. దీదీ పనైపోయింది. దాదా దిగేశాడు. కమలానికి కోల్ కతాలో గట్టి పట్టు దొరికింది. సౌరవ్ గంగూలీ ఇలా రాజకీయ ప్రవేశం చేయడం.. అలా బీజేపీలో చేరడం.. వెంటనే మమతా బెనర్జీని దించేయడం.. వెంటవెంటనే జరిగిపోతాయి.. ఇదీ ఒక ట్వీట్ కు మీడియా ఇచ్చిన కలరింగ్.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ఒక ట్వీట్ తో మీడియాకు మంచి మసాలా దొరికింది. దాదా, రాజకీయాల్లోకి వస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారని, ఇప్పటికే బీజేపీ నేతలతో పలు దఫాలు చర్చలు సఫలమయ్యాయని మీడియా గానాలు (ఊహాగానాలు అని చదువుకోవాలి) క్షణాల్లో ఊపందుకున్నాయి. అయితే కొద్ది గంటల్లోనే మీడియా స్పెక్యులేషన్ ఎక్కువ, అసలు విషయం తక్కువ అని తేలిపోయింది….

అసలేం జరిగింది…

ట్విట్టర్ వేదికగా  గంగూలీ ఓ ప్రకటన చేశారు. ఎక్కువ మంది ప్రజలకు సాయపడాలనే ఉద్దేశంతో తానొక నిర్ణయానికి వచ్చినట్లు దాదా ట్వీట్ చేశారు తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నానని, ఇప్పుడు కూడా అందరి మద్ధతు ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని పోస్ట్ చేశారు. తను క్రికెట్లోకి అడుగు పెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ట్వీట్ చేస్తున్నానన్నారు.  ఇప్పటి వరకు క్రికెట్‌కు సేవ చేశానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని గంగూలీ చేసిన ట్వీట్‌తో రాజకీయాల్లోకి రావాలని దాదా నిర్ణయించుకున్నట్లు స్పెక్యులేషన్ మొదలైంది. . త్వరలో సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు మీడియా లెక్కలేసింది.  అమిత్‌ షాతో దాదా టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బయటపెట్టింది. నెల క్రితం అమిత్ షా కోల్ కతా వెళ్లినప్పుడు దాదా ఇంటికి డిన్నర్ కు వెళ్లడం మీడియా ఊహాగానాలకు ఊతమిచ్చింది. అమిత్ షా తనయుడు జయ్ షా … బీసీసీఐ కార్యదర్శిగా ఉండటంతో  స్పెక్యులేషన్ తారా స్థాయికి చేరింది.

గంగూలీ ట్వీట్ తో మీడియాకు బాగానే పని దొరికిందనే చెప్పాలి. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వగానే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని కూడా గంగూలీ తమకు స్వయంగా చెప్పినట్లు రాసేశారు. గంగూలీ బీజేపీలో చేరితే రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారని ప్రచారం చేసేశారు. ఆ వెంటనే బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా మారతారని, అక్కడ బీజేపీకి కొత్త ఊపిరి అందుతుందని చెప్పుకొచ్చారు ఇక మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టడం ఖాయమని కూడా విశ్లేషణలు మొదలయ్యాయి….

గంగూలీ వివరణ ఏమిటి ?

ఊహాగానాల్లో మీడియా బిజీ అయిపోయి.. కాసేపటికి వేరే టాపిక్ కు వెళ్లిపోయిన తర్వాత గంగూలీ నింపాదిగా  స్పందించారు. తన ట్వీట్ లో పరమార్థం ఏమిటో వెల్లడించారు తాను బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోవడం లేదని తేల్చేశారు. త్వరలో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ యాప్ ప్రారంభిస్తున్నానని, ఆ విషయమే పరోక్షంగా ట్వీట్ చేశానని చెప్పుకున్నారు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పేశారు.

ఇప్పటికీ ఛాన్సుంది…

గంగూలీ ట్వీట్ వెనుక ఏదో మతలబు ఉందని మాత్రం అనుమానాలు చల్లారడం లేదు. గతంలోనూ క్రికెటర్లు రాజకీయాల్లో రావడం, రాజకీయ పదవులు నిర్వహించడమే ఇందుకు కారణం. సునీల్ గవాస్కర్, ముంబై షరీఫ్ గా పనిచేశారు కపిల్ దేవ్ కాంగ్రెస్ లో చేరారు. కీర్తి ఆజాద్ .. ఎంపీగా సేవలందించారు. ఇలా చాలా మందే ఉన్నారు. పైగా గంగూలీ, బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎప్పుడు చూసినా జయ్ షా తోనే కనిపిస్తున్నారు. అందుకే భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రావఢం ఖాయమన్నది కొందరి వాదన….