ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా. కొత్త పార్టీని ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారా… దళితుల్లో రాజకీయ పునరుజ్జీవం సాధ్యమా… అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కుల కోసం పోరాడతారా.. గతం అనుభవాలు చెబుతున్నదేమిటి… ?
ఆయన బాగా చదువుకున్నారు చిన్న వయసులోనే జడ్జి అయ్యారు. దళిత జనోద్ధరణ కోసం ఉద్యోగం వదిలేసి లాయర్ వృత్తిలోకి దిగారు. బాధితుల తరపున పోరాడుతున్నారు. టీవీ చర్చల్లో విశ్లేషణలు చేస్తూ రాజకీయ నాయకులకు ఆయన ముచ్చెమటలు పోయిస్తారు. ఇప్పుడు ఆయనే ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు. దళితుల అభ్యున్నతి కోసం జై భీమ్ భారత్ పార్టీని ప్రారంభిస్తున్నారు. ఆయనే దళిత మేథావి జడ శ్రవణ్ కుమార్…
ఆంధ్రప్రదేశ్ విచిత్ర రాజకీయ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు మరో పార్టీ వచ్చేస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ… దళిత, వెనుక వర్గాల పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ జగన్ ప్రభుత్వ నిర్ణయాలు దళిత వర్గాల వెన్ను విరిచి… వారిని భికారీగా మార్చేస్తోందన్న ఆరోపణలున్నాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా దళితులకు ఒరిగించిందేమీ లేదని చరిత్ర చెబుతోంది. దానితో చాలా రోజులుగా ఒక పార్టీ పెట్టాలన్న ఆలచనతో ఉన్న జడ శ్రవణ్ కుమార్… ఇప్పుడు తన మనసులోని మాటను బయట పెట్టారు.అసెంబ్లీ ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే అంబేద్కర్ జయంతి రోజున ప్రకటన చేసి ఇప్పుడున్న పార్టీలను టెన్షన్ పెట్టేశారు….
గత అనుభవాలేమిటి…
దక్షిణాదిన దళిత పార్టీలు అధికారానికి వచ్చిన అనుభవాలు లేవు. తమిళనాడులో దళిత పార్టీల కోకొల్లలుగా ఉన్నాయి. పుదియ తమిళగం అనే పార్టీ నాయకుడు కృష్ణస్వామి ఎమ్మెల్యేగా గెలవడం, విడుదల చిరుతై పార్టీ వ్యవస్థాపకుడు తిరుమా వలవన్ ఎంపీగా విజయం సాధించడం మినహా.. అధికారానికి దరిదాపుల్లో వచ్చిన సందర్భమూ లేదు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణమాదిగ .. పార్టీ పెట్టినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఇన్ని రోజులైనా ఆయన కోరుకున్నా….ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోలేదు. ప్రధాన పార్టీలు మంద కృష్ణమాదిగను పావుగా వాడుకుంటున్నాయే తప్ప.. ఆయనతో ఎన్నికల పొత్తుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు…
శ్రావణ్…సవాళ్లు
నిజానికి శ్రావణ్ ఫైర్ బ్రాండ్ . టీవీ చర్చల్లో పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో విపక్షాలు సైతం విఫలమయ్యాయంటూ టీడీపీ, జనసేనపై ఆయన విరుచుకుపడున్నారు. దళితుల కోసం పాటుపడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని శ్రవణ్ చెబుతున్నారు. రాజధాని దళిత రైతుల తరపున ఆయన కోర్టులో వాదిస్తున్నారు.ఏపీలో దళితులకు సంబంధించిన కేసులు వాదించేందుకు ఆయనకు ఒక టీమ్ ఉంది. అలాగని దళితులకు ఆయన ఏకైక లీడర్ అవుతారా అంటే అవునని చెప్పలేం. శక్తిమంతులైన దళిత నాయకులు ఇప్పటికే ప్రధాన పార్టీల్లో స్థిరపడిపోయారు. వారికి సముచిత పదవులు ఇచ్చి ఆయా పార్టీలు దళిత సామాజిక వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
మాయావతి ఫెయిల్యూరే గుణపాఠమా….
ఉత్తర ప్రదేశ్ లో దళిత నాయకురాలు మయావతి వేర్వేరు సందర్భాల్లో నాలుగు సార్లు మఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. 405 ఎమ్మెల్యే స్థానాలున్న ఆ రాష్ట్రంలో నాడు బీఎస్పీకి 200 సీట్లకు పైగా వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఆమె పార్టీ తరపున కేవలం ఒక ఎమ్మెల్యే గెలిచారు. వరుస పొరపాట్లు, దళితుల్లో అనైక్యత, రాజకీయ సమీకరణాలు మారడం, బీజేపీ బలమైన పార్టీగా అవతరించడంతో బీఎస్పీ నిలదొక్కుకోలేకపోతోంది. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న లాయర్ శ్రవణ్ కు మాయావతి వ్యవహారం ఒక కేస్ స్టడీ లాంటిది. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అంగబలం, అర్థబలం ఉండాలి. దళితుల కోసమే కాకుండా విశాల జనహితం కోసం పనిచేస్తున్నారన్న విశ్వాసం కల్పించారు. మాయావతి కూడా బ్రాహ్మణ, దళిత సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడే విజయం సాధించారని మరిచిపోకూడదు. లేనిపక్షంలో శ్రవణ్ కుమార్ టీవీ పులిగానే మిగిలిపోతారు…..