లంకా దహనం..నేతల పలాయనం

By KTV Telugu On 11 May, 2022
image

శ్రీలంక దేశం రావణకాష్టంలా మండుతోంది. రామాయణ కాలంలో హనుమంతుడు లంకను కాల్చేస్తే.. ఇప్పుడు అక్కడి జనమే రెండు గ్రూపులుగా విడిపోయి. దేశాన్ని తగులబెట్టుకుంటున్నారు. ధరలు, శాంతి భద్రతల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణల మధ్య నిరసనలు, ఘర్షణలుగా మారాయి. ఇళ్లు తగులబడ్డాయి. కార్యాలయాలు కాల్చేశారు. బస్సులు, కార్లు దహనమయ్యాయి. దేశంలో పరిస్థితి అస్తవ్యస్థమైంది. వీధుల్లో దహనకాండ మినహా.. దేశంలో పాజిటివ్ గా జరుగుతున్నదేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు….

చర్చిపై దాడి తర్వాత దిగజారిన పరిస్థితులు

దాదాపు రెండు కోట్లకు పైగా జనాభా కలిగిన శ్రీలంకని ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. 2019 లో ఈస్టర్ పండుగ రోజు ఓ చర్చిలో జరిగిన దాడి ఆ దేశపర్యాటక రంగాన్ని బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత కరోనా మరింత దెబ్బకొట్టింది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.

లంకలో హింసాకాండ

లంకలో నిరనసలు మొదలై నెల దాటింది. ధరాఘాతాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణల నడుమ నిరసనలు మొదలయ్యాయి. పెట్రోల్ లీటర్ రూ. 350 రూపాయలు, టమాట రూ. 200 రూపాయలు, కోడి గుడ్డు రూ. 100 రూపాయలకు విక్రయం కావడం, హోటల్ రేట్లు పది రెట్లు పెరగడంతో జనం అసహనానికి, ఆందోళనకు లోనయ్యారు. నేరుగా దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసం ముందే టెంట్ వేసి నిరసనలు తెలియజేశారు. ఆచరణ సాధ్యం కాని ఆర్థిక విధానాలు, చైనా ఆధిపత్యంలోకి శ్రీలంక వెళ్లిపోవడం లాంటి ఘటనలే సంక్షోభానికి కారణంగా గత నెల విశ్లేషించారు.

ఇన్ని రోజులైనా శ్రీలంక పరిస్థితి అదుపులోకి రాలేదు. సంక్షోభ నివారణకు జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, విపక్షాలు కూడా ప్రభుత్వంలో చేరాలని గోటబయ రాజపక్స పిలుపునిచ్చారు. అయితే అందుకు విపక్షాలుఅంగీకరించలేదు. ముందు ప్రధాని మహీందా రాజపక్స రాజీనామా చేయాలని, తర్వాత అవసరాన్ని బట్టి గొటబయ కూడా వైదొలగాలని అప్పుడే రాజీ మార్గం సాధ్యమని విపక్షాలు పట్టుబట్టాయి.అప్పటి వరకు శాంతియుత నిరసనోద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. చివరకు ప్రధాని మహీందా రాజీనామా సమర్పించారు అయితే మహీందా వైదొలిగిన గంట లోపే హింసాత్మక సంఘటనలు మిన్నంటాయి…

శ్రీలంక నుంచి వస్తున్న వార్తలు విచిత్రంగా ఉన్నాయి. మాజీ ప్రధాని మహీందా మద్దతుదారులే దాడులకు దిగుతున్నారని.. శాంతియుతంగా నిరసనలకు దిగుతున్నవారిని చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహీందా నివాసం లోపలి నుంచి కాల్పులు జరిగాయని మరో ఆరోపణ. దానితో ఆయన నివాసాన్ని నిరసనకారులు తగులబెట్టారు. ఘర్షణలు చెలరేగిన కొన్ని గంటల తర్వాత, ఒక ఎంపీ సహా ఐదుగురు మరణించారు దాదాపు 200 మంది గాయపడ్డారు. కొలంబో సమీపంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులతో ప్రతిష్టంభన తర్వాత పాలక పార్టీ పార్లమెంటేరియన్ అమరకీర్తి అతుకోరల మరణించారు. పలువురు అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పుపెట్టడంతో అవి కాలి బూడిదైపోయాయి అధికార పార్టీ నేతలంతా ఆర్మీ భద్రతతో సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోయారు. వారిలో ఎక్కువ మంది తాత్కాలికంగా ఇండియాలో తలదాచుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

నాటి సమర్థత ఏమైంది ?

 

పదేళ్ళ పాటు శ్రీలంక అధ్యక్షుడిగా మహీందా రాజపక్స తిరుగులేని ఆధికారం చెలాయించారు. తమిళ వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. వేలాది మంది తమిళులను హతమార్చారు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ను, ఆయన కుమారుడిని కిరాతకంగా చంపారు. చైనా నుంచి అప్పులు తెచ్చి వాటిలో సింహభాగం నొక్కేశారు. 2015 ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడినా 2019లో అధికారంలోకి వచ్చాక ఈయన తమ్ముడు గొటబయ అధ్యక్షుడు కావడంతో మహీందా ప్రధాని పదవిని చేపట్టారు.మరో ఇద్దరు తమ్ముళ్లు, కొడుకు కూడా మంత్రులుగానే పనిచేశారు. మొత్తం మీద ఆయనది కుటుంబ పాలనగా మారింది. మహీందా కటుంబం విచ్చలవిడిగా చేసిన అవినీతి.. దేశంలో ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలే శ్రీలంక కొంప ముంచాయి. రాజీనామా చేశాక.. నిరసనకారులు ఇళ్లు తగులబెడుతుంటే.. మహీందా కుటుంబం ప్రాణభయంతో వణికిపోతోంది.

చైనా గేమ్ ప్లాన్

శ్రీలంకలో తాజా హింసాకాండ వెనుక చైనా గేమ్ ప్లాన్ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీలంకను తమ ఆధిపత్యంలోనే ఉంచుకోవాలని చైనా పాలకులు భావిస్తున్నారు. మూడో దేశ జోక్యం వద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు శ్రీలంకకు భారత్ మానవతాసాయం చేయడం కూడా చైనాకు ఇష్టం లేదు.. లంకలో అశాంతిని సృష్టించి.. ఆర్థిక వ్యవస్థను మరింతగా దిగజారిస్తే .. ఆ దేశం తమ చెప్పుచేతల్లో ఉంటుందని చైనా విశ్వసిస్తోంది..