నువ్వు నటిస్తావా జాన్వీ?
నన్ను ఎందుకు ఏడిపించాలి అనుకుంటున్నారు !
శ్రీదేవి బయోపిక్ కోసం అతిలోకసుందరి అభిమానులు కళ్లలో వత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్నారు.
కాని ఈ బయోపిక్ ఇప్పుడప్పుడే తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. శ్రీదేవి జీవితాన్ని నేపథ్యంగా చేసుకుని తెరకెక్కే చిత్రాన్ని ఆమె భర్త బోనీ కపూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకుంటున్నాడు. అందుకోసం సరైన కథానాయికను ఎంపిక చేయాలనుకుంటున్నాడు. టాలీవుడ్ టు బాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్, శ్రీదేవి అభిమానులుగా చెప్పుకునే కథానాయికలు వెండితెరపై ఆమె పాత్రను పోషించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో తమన్నా కూడా శ్రీదేవిగా నటించేందుకు తాను రెడీ అని తెలిపింది.
కాని, ఎప్పుడైతే జాన్వీ తెరకు పరిచయం అయిందో , ఆమెతోనే శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించవచ్చు కదా అనే ప్రచారం మొదలైంది. ఇదే విషయాన్ని మిలీ ప్రమోషన్స్ లో జాన్వీ ముందు తీసుకొచ్చింది టాలీవుడ్ మీడియా.
అప్పుడు జాన్వీ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. శ్రీదేవి బయోపిక్ లో మీరు నటించాలనుకుంటున్నారా అని జాన్వీని ప్రశ్నించగా, లేదు అని సమాధానం చెప్పింది జాన్వీ. ఇందుకు కారణం చెప్పమని మీడియా ప్రతినిధులు కోరగా, వివరణ ఇచ్చేందుకు చాలా సమయం పడుతుందని, ఇప్పుడు స్టేజ్ పై తను ఏడవాలి అనుకోవడం లేదని తెలిపింది జాన్వి. తల్లి దూరమై చాలా కాలమే అయినా , ఆ బాధను గుండెల్లో భరిస్తూ సినిమాల్లో నటిస్తోంది జాన్వి. ఆమె నటిస్తున్న న్యూ మూవీ మిలీ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.