దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఆయన ఒకరు. ఏడాదిలోనే ఐదేళ్లకు సరిపడా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన నేతగా రికార్డుకెక్కారు. అహర్నిశలు ప్రజలకు దగ్గరగా ఉంటారాయన. ఎవరైనా కనిపిస్తే కాన్వాయ్ ఆపి మాట్లాడతారు. సిటీ బస్సు ఎక్కి జనం బాగోగులు తెలుసుకుంటారు. ఇంకా చేయాల్సిందేమిటని ప్రజలను అడిగి… ఆ దిశగా అడుగులు వేస్తారు. అందుకే ఆయనకు దళపతి అని పేరు. అలాంటి దళపతి స్టాలిన్ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశమైంది..
సంచలనమైన హగ్గింగ్ ఫోటో…
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి..పేరరివలన్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు విడుదలైన ఆయన ఇకపై జైలుకు వెళ్లాల్సిన పనిలేదు పెరరివలన్ ను విడుదల చేయాలని స్టాలిన్ ప్రభుత్వం కూడా గతంలో కోరింది. ఇదంతా బాగానే ఉంది.. అందులో తప్పు లేదు. అయితే తీర్పు వచ్చిన వారం లోపే స్టాలిన్, పేరరివలన్ ఉన్న ఒక ఫోటో సంచలనమైంది. చెన్నై విమానాశ్రయంలో స్టాలిన్ ను పెరరివలన్ కలుసుకున్నారు. అప్పుడు స్టాలిన్ ఆయన్ను హగ్ చేసుకున్నారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే వాటేసుకున్నారు.. లేదా ఆలింగనం చేసుకున్నారు….
ఆలింగనంలో తప్పేమిటి..
తెలిసిన వ్యక్తి కనిపించినప్పుడు పలుకరించుకోవడం, ఆలింగనం చేసుకోవడంలో తప్పేమిటన్నది తమిళ జాతీయవాదుల ప్రశ్న. బీజేపీతో పాటు తమిళనాడులోని కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఒక మాజీ ప్రధానిని అత్యంత కిరాతకంగా చంపిన ఉగ్రవాద ముఠా సభ్యుడిని ఎలా ఆలింగనం చేసుకుంటారని బీజేపీ ప్రశ్నిస్తోంది. తమ పొత్తు భాగస్వామిగా ఉన్న డీఎంకే నేతలు.. ఇలా మనోభావాలను దెబ్బతీయడం సరికాదని తమిళనాడు కాంగ్రెస్ నేతల వాదన. పేరరివలన్ విడుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మౌన ఊరేగింపు కూడా నిర్వహించింది.
అనుసూయ డైసీ ఎర్నెస్ట్ అనే మాజీ పోలీసు అధికారిణి కూడా స్టాలిన్ తీరుపై విమర్శలు గుప్పించారు. శ్రీపెరుంబుదూర్లో రాజీవ్ హత్యకు గురైనప్పుడు ఇన్స్ పెక్టర్ గా ఆమె అక్కడే డ్యూటీలో ఉన్నారు మానవ బాంబు ధాను… మాజీ ప్రధాని దగ్గరకు వెళ్లకుండా ఆమె అడ్డుకున్నారు.. అయితే రానివ్వండి ఏమీ కాదులే అని రాజీవ్ అనడంతో ధాను ఆయన దగ్గరకు వెళ్లగలిగారు. ఉగ్రవాద దాడికి ప్రత్యక్షసాక్షిగా ఇప్పుడు స్టాలిన్ చేసిన పని పట్ల ఆందోళన చెందుతున్నానని అనుసూయ డైసీ చెబుతున్నారు….
శివసేన అభ్యంతరం
స్టాలిన్ తీరును మహారాష్ట్రలో అధికార సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న శివసేన తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఇలాంటి చర్యలు తప్పుడు సంకేతాలిస్తాయని, ఇదీ రాజకీయ సంస్కృతి కాదని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో రాశారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా పనిచేశారన్న సంగతి మరిచిపోకూడదని సామ్నా ఎడిటోరియల్ ఘాటుగా విమర్శించింది. రాజకీయాల్లో నేరచరితులు పెరిగిపోతున్న వేళ.. నేరుగా నేరగాడినే ఆలింగడం చేసుకోవడం తగదని సూచించింది. గతంలో కొందరు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు సన్మానాలు జరిగినప్పుడు కూడా తాము వ్యతిరేకించామని శివసేన గుర్తుచేసింది. ఇందిరాగాంధీని హతమార్చిన వారిని హీరోలుగా ప్రచారం చేయడం ఎంత తప్పో… పేరరివలన్ ను హగ్ చేసుకోవడం కూడా అంతే తప్పని శివసేన అంటోంది. మరో పక్క తాజా ఫోటో వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందించినా… గాంధీ కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. సోనియా, రాహుల్, ప్రియాంక ఏ మాత్రం పట్టించుకోలేదు.