సుప్రీంలో మహిళా జడ్జీల ప్రత్యేక ధర్మాసనం

By KTV Telugu On 1 December, 2022
image

సుప్రీం చరిత్రలో అలాంటి బెంచ్‌ మూడోసారి

అత్యున్నతన్యాయస్థానంలో మరోసారి మహిళా జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం. త్రివేది కొత్త బెంచ్‌ ఏర్పాటుచేశారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. మహిళా జడ్జీలతో స్పెషల్‌ బెంచ్‌ సుప్రీం చరిత్రలో ఇది మూడోసారి. తొలిసారి 2013లో జస్టిస్‌ జ్ఞాన సుధామిశ్రా, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశాయ్‌ ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. వాస్తవానికి అప్పట్లో అది యాదృచ్ఛికంగా జరిగింది. అప్పటి ప్రిసైడింగ్‌ జడ్జి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనం ఏర్పాటు అనివార్యమైంది. ఆ తర్వాత 2018లో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో మరోసారి మహిళా ధర్మాసనం కొలువుదీరింది.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులున్నారు. వీరిలో ముగ్గురు మహిళా జడ్జీలు. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ బేలా త్రివేది 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరు బాధ్యతలు చేపట్టేనాటికి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ కూడా సుప్రీంకోర్టు జడ్జీగా ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యధికంగా నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉంది అప్పుడే. ఈ ఏడాది అక్టోబరులో జస్టిస్‌ ఇందిరాబెనర్జీ రిటైరయ్యారు.

సుప్రీం న్యాయమూర్తుల్లో జస్టిస్‌ బి.వి. నాగరత్న ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. 2027లో ఆమె 36 రోజులపాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశముందంటున్నారు. అది సాకారమైతే సుప్రీం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. మొత్తానికి మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనంతో కొన్ని ప్రత్యేక కేసులు వేగంగా కొలిక్కివస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.