కొత్తగా కొనే బైక్‌లు, స్కూటర్లపై లైఫ్ ట్యాక్స్ ఆ వాహనం ధరపై ఇప్పటి వరకు 9 శాతం ఉంది. ప్రస్తుతం వాహన ధర ఆధారంగా రూ.50 వేల లోపు అయితే 9 శాతం, రూ.50 వేలకు మించితే 12 శాతంగా నిర్ణయించారు. నిజానికి ఇప్పుడు రూ. యాభై వేలకు వచ్చే టూవీలర్ ఏదీ లేదు. టీవీఎస్ ఎక్స్ ఎల్ మోపెడ్ మాత్రమే వస్తుంది. అంటే ఆ వాహనానికి మాత్రమే తొమ్మిది శాతం పన్ను. మిగతా అన్ని వాహనాలకు పన్నెండు శాతం పన్ను వసూలు చేస్తారు. ఒక్కో వాహనంపై కొత్తగా కొనేవారికి రూ.3 వేలు అదనపు భారం పడనుంది. ఇది కొత్తగా బైక్‌లు కొనేవారికి అదనపు భారంగా మారనుంది.
ఇతర వాహనాలపైనా భారీగానే వడ్డింపు !
వాహనాలను శ్లాబ్‌లుగా విభజించి వేరువేరుగా రేట్లను ఖరారు చేశారు. ఒక్కో బండిపై 2 శాతం నుంచి 4 శాతం వరకు టాక్స్ పెంచింది. కొత్త ట్యాక్స్‌ల ప్రకారం బండిని బట్టి రూ.3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా కట్టాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్‌పోర్ట్‌లో త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనాల లైఫ్ ట్యాక్స్ ఇప్పటి దాకా రెండు స్లాబులుగా ఉండగా, దాన్ని నాలుగు స్లాబులుగా మార్చింది. కార్లు, జీపులు, ఆటోలు, 10 సీట్ల ఓమ్నీ బస్ వంటివి వస్తాయి. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదైన వాహనాలకు 12 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదైన వాహనాలకు 13 శాతం లైఫ్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక నుంచి రూ.5 లక్షల లోపు వాహనాలకు 13 శాతం, రూ.5 నుంచి 10 లక్షల మధ్య వెహికల్స్‌కు 14 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల ధర కంటే ఎక్కువగా ఉండే వాటిపై 18 శాతంగా నిర్ణయించారు. అంటే ఒక్కో వాహనంపై సుమారు రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు అదనంగా లైఫ్ ట్యాక్స్ భారం పడుతుంది.
రేట్ల వారీగా వర్గీకరించి లైఫ్ ట్యాక్స్ వేయడంతో భారీగా భారం !
ఇప్పటివరకు వాహనం ఏదైనా.. రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12%.. ఆపై ధర ఉంటే 14% లైఫ్ ట్యాక్స్‌ను విధించేవారు. తాజాగా ద్విచక్ర వాహనాలకు వేరుగా.. మిగతా వాహనాలకు వేరుగా నిర్ధారించారు. అన్ని వాహనాలకూ అదే పరిస్థితి. తక్కువగా అమ్ముడయ్యే ధర తక్కువ వాహనాలకు పాత పన్నే ఉంచి.. ఎక్కువగా అమ్ముడయ్యే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు ఎక్కువ పన్ను విధించారు. ఈ భారం కొత్తగా కార్లు, బైకులు కొనాలనుకునేవారికి ఇబ్బందికరమే. ఇతర కమర్షియల్ వాహనాల పై కూడా టాక్సులు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై.. తెలంగాణకు బదిలీ అయిన వాహనాలకు వాటిని కొన్నకాలం ఆధారంగా పన్నులను నిర్ణయించారు. రూ.50 వేలు, ఆపై ధర ఉంటే.. కొని రెండేళ్లకు మించకుంటే 11 శాతం పన్ను ఉంటుంది. తర్వాత ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక్కో శాతం ట్యాక్స్‌ను తగ్గుతూ ఉంటుంది.