ఫైర్ బ్రాండ్లకే భయమేస్తోంది. ముప్పు ఎటువైపు నుంచి పొంచి ఉందో అర్థం కాని దుస్థితి నెలకొంది. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు కాచుకు కూర్చున్నారన్న భయం వెంటాడుతోంది. కాపాడండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న భీతావహ వాతావరణం ఇది..
ప్రత్యర్థులను పురుగుల కంటే హీనంగా కొట్టి పారేసే నేత అచ్చెన్నాయుడు. ఎవరితోనైనా బస్తీ మే సవాల్ అన్నట్లుగా తొడకొట్టే సిక్కోలు సింహం అచ్చెన్న. టీడీపీ ఏపీ అధ్యక్షుడి బాధ్యతలో ఉన్న అచ్చెన్నాయుడు.. రోజుకు మూడు సార్లు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటారు. రెండు పర్యాయాలు జగన్ సర్కారు అయన్ను జైలులో పెట్టింది. అయినా ఎక్కడా వెనుకంజ వేసిన దాఖలాలు లేవు, విమర్శల వాడీ, వేడి ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జగన్ టీమ్ అంతు చూస్తామని తరచూ హెచ్చరిస్తుంటారు. పార్టీ అధినేత చంద్రబాబుకు దాదాపు కుడిభుజంగా ఉండే అచ్చెన్న… ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కు అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. దూకుడుగా ఉండే శ్రీకాకులం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నప్పటికీ.. పార్టీ శ్రేణులకు అత్యంత సన్నిహితంగా ఉండేది మాత్రం అచ్చెన్నాయుడే.
నిజంగా చెప్పేందుకు అచ్చెన్నాయుడు వెనుకాడదు. కొన్ని రోజులు క్రితం ఒక వ్యక్తి పార్టీ గురించి ప్రస్తావించినప్పుడు ఇంకా ఏం పార్టీ అంతా అయిపోయిందని అచ్చెన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.పైగా లోకేశ్ సక్రమంగా ఉంటే మనకు ఈ ఇబ్బందులు ఎందుకు అని కూడా అచ్చెన్నాయుడు వాపోయిన సందర్భాలున్నాయి. ఆయన్ను వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ టీడీపీని వదిలి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు…
ఇప్పుడెందుకంత భయం..
అచ్చెన్నకు ఇంటా బయట శత్రువులున్నారని ఆయన క్రమంగా గ్రహించారు. తనను డైరెక్టుగా దెబ్బతీసే దమ్ము లేని వాళ్లు… దొంగ దెబ్బ తీస్తారని ఆయన అనుమానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆయన బంధువుల్లో చాలా మంది వైసీపీలో ఉన్నారు. బంధువులతో ఫోన్లో మాట్లాడితేనే బెదిరించారంటూ వైసీపీ అచ్చెన్నపై కేసు పెట్టింది. రాజకీయాల్లో పండిపోయిన అచ్చెన్నను చాలా మంది ప్రత్యర్థులున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా…. విజయం సాధించిన వారిలో అచ్చెన్న ఒకరు. వచ్చే ఎన్నికల నాటికి అచ్చెన్న శక్తిమంతుడిగా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని ఓడించడం కష్టమని… వైసీపీ మాత్రమే కాకుండా ఇతర పార్టీలు గ్రహించాయి. ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దాడులు చేసి భయపెడితే అచ్చెన్న బయటకు రాకుండా ఉంటారని ప్రత్యర్థి వర్గం భావిస్తోందట. అందుకే ఇప్పుడు అచ్చెన్న అదనపు భద్రత కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ స్థానంలో ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత కావాలని అడుగుతున్నారు. టీడీపీ వారి ప్రతీ విన్నపాన్ని బుట్టదాఖలు చేసే జగన్ రెడ్డి.. ప్రస్తుత డిమాండ్ పై ఎలా స్పందిస్తారో….