తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటి ? రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం మినహా చేయగిలిందేమైనా ఉందా ? ఎండు ములగచెట్టు చిగురించడం సాధ్యమా ? జనం మరిచిన జ్ఞానేశ్వర్ పార్టీని గెలిపించగలరా ? మునుగోడు ఫలితంతో టీడీపీలో ఆశలు చిగురించాయా ?
తెలంగాణలో పెరుగుతున్న మఖ్యమంత్రి అభ్యర్థులు
టీడీపీకి దొరికాడు ఒక కాసాని జ్ఞానేశ్వర్
పార్టీకి పూర్వవైభవం తెస్తామంటున్న కాసాని టీమ్
ఎంతో ఆశగా ఆహ్వానించిన చంద్రబాబు
తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థులు పెరిగిపోయారు. టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ గెలిస్తే స్వతహాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ లేదా మరో బలమైన నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. దానితో హస్తం పార్టీలో ఇద్దరు ముగ్గురు సీఎం క్యాండేట్లు ఉండనే ఉన్నారు బీజేపీ గెలిస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా అరడజను మంది ఇప్పటి నుంచే వెయిటింగ్. అలుపెరుగని బాటసారి వైఎస్ షర్మిల ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే తాను ప్రధానమంత్రి పదవికి గాలం వేస్తున్నట్లు ఆమె ఇంకా చెప్పలేదు. కేఎ పాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాకపోవచ్చు. ఎందుకంటే తను కాబోయే ప్రధానమంత్రినని ఆయన చెప్పుకుంటున్నారు. వీళ్లందరితో పోటీ పడేందుకు టీడీపీ నుంచి ఒక అభ్యర్థి రెడీ అయ్యారు. ఆయనే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ రాష్ట్ర అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. నిద్రపోతున్న టీడీపీ కేడర్ ను మేల్కొల్పేందుకు ఇదే తగిన అవకాశమని జ్ఞానేశ్వర్ రాక టానిక్ లా పనిచేస్తుందని భావించిన చంద్రబాబు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా ర్యాలీ కూడా జరిగిందనుకోండి….
టీడీపీ నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన జ్ఞానేశ్వర్
రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా సేవలు
దేవేందర్ గౌడ్ తో విభేదాల కారణంగా నిష్క్రమణ
ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు
జ్ఞానేశ్వర్ తొలుత టీడీపీలోనే ఉండేవారు. 2000 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. అప్పటికింకా తెలంగాణ ఉద్యమం బలపడలేదు హైదారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు బలమైన నేతల్లో ఆయన ఒకరు. దేవేందర్ గౌడ్ కు ఆయనకు మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఇద్దరు వేలకోట్ల ఆసాములు కావడంతో దేవేందర్ గౌడ్ ఆధిపత్యాన్ని కాసాని తట్టుకోలేకపోయారు. దానితో ఆయన టీడీపీ నుంచి వైదొలిగారు. చాలా పార్టీలు మారారు సొంత కుంపట్లు పెట్టారు. ధనబలంతో రాజకీయం ఏలా చేయొచ్చో ఆయనకు బాగా తెలుసు. టీఆర్ఎస్ లో కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి ఓట్లు పొంది ఎమ్మెల్సీ కూడా అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యంతో చేతులు కలిపినా ప్రయోజనం కనిపించలేదు. అలా తిరిగి తిరిగి ఇప్పుడు మళ్లీ పచ్చచొక్కా తొడుక్కున్నారు. ముదిరాజ్ మహాసభకు జాతీయ అధ్యక్షుడిగా ఉండటంతో కులబలం కూడా కాసానికి తోడవుతోంది..
కేడర్ బలమున్న టీడీపీ
ప్రతీ నియోజకవర్గంలోనూ పది వేల ఓట్లున్నట్లు వాదన
నాయకత్వ లోపంతోనే తెలంగాణలో ఇబ్బందులు
పార్టీ లోటుపాట్లను జ్ఞానేశ్వర్ పరిష్కరిస్తారని నమ్మకం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అలాగని చచ్చిపోయిన పార్టీ అని చెప్పలేం. ఎన్టీఆర్ స్థాపించిన ఆ పార్టీకి రాష్ట్రంలో కేడర్ బలముంది. ఓటర్లకు ఇంకా ఆ పార్టీపై నమ్మకం ఉంది. ప్రతీ నియోజకవర్గంలోనూ తమకు పది వేల వరకు ఓట్లున్నాయని పార్టీ నేతలు చెబుతుంటారు. ఎన్నికల్లో ఓట్లు రాలకపోవడానికి సరైన నాయకత్వం లేకపోవడమేనని అంచనా వేస్తుంటారు. అందుకే ఉప ఎన్నికల్లో పోటీకి కూడా టీడీపీ వెనుకాడుతోంది మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని, అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకుని ధైర్యం చాలక టీడీపీ వెనక్కి తగ్గింది. కేడర్ తమ ఆత్మప్రబోధానుసారు ఓటు వేసుకోవచ్చని అధినాయకత్వం ప్రకటించింది. ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరిపోయిన తర్వాత పార్టీకి సరైన నాయకుడు లేడని ఆందోళన పడుతున్న తరుణంలోనే జ్ఞానేశ్వర్ వచ్చి చేరారు. ఒకప్పుడు పార్టీని వదిలిన ఆయనే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కయ్యారు.
బీసీ కులాలను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం
పేరున్న నాయకుడైతే జనంలో విశ్వాసం పెరిగే అవకాశం
మునుగోడు తరహాలో ధన ప్రవాహానికి వీలు
74 బీసీ కులాలను ఏకతాటిపై తెచ్చి జ్ఞానేశ్వర్ తమ పార్టీని బలోపేతం చేస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. కాసాని కూడా త్వరలో పాదయాత్ర లేదా రాష్ట్ర పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. పేరున్న నాయకుడైతే జనం గుర్తుపట్టే వీలుంటుందని జ్ఞానేశ్వర్ రాకతో ఆలోటు తీరిందని టీడీపీ కేడర్ అంటోంది. ఇక జనంలో తిరగడానికి, ఇతర ఖర్చులకు పార్టీపై ఆధారపడకుండా తానే వ్యయం చేసేందుకు ఆయన దగ్గర నిధులున్నాయ్. మునుగోడు తరహాలో డబ్బులు పెట్టి ఓట్లను కొనే సంపద కూడా కాసానికి ఉన్న అదనపు ఆకర్షణగా చెప్పుకోవాలి. దానితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలదు. అదృష్టం ఉంటే జ్ఞానేశ్వర్ సీఎం అవుతారేమో ఎవరికి తెలుసు.