ఏపీలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా? అనధికారికంగా సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందా? ఏయే సీట్లలో జనసేన పోటీ చేయబోతోందో క్లారిటీ వచ్చేసిందా? జనసేన అభ్యర్ధులు బరిలోకి దిగబోయే నియోజక వర్గాలేవో స్పష్టత వచ్చేసిందా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తోంటే వీటన్నింటికీ అవును అనే సమాధానమే వస్తోందంటున్నారు రాజకీయ పండితులు.పక్క రాష్ట్రంలో ఉండి ఏపీలో రాజకీయాలు చేస్తారంటూ వస్తోన్న ఆరోపణలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారని తెలుస్తోంది. ఎన్నికల వరకు ఇక మంగళగిరిలోనే కాపురం ఉండాలని జనసేనాని నిశ్చయించుకున్నట్లు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెనాలి నియోజక వర్గంలో పార్టీలో నెంబర్ టూ గా ఉంటోన్న నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని సైనికులకు పిలుపు నిచ్చారు. తెనాలిని ఉద్దేశించి ఆ సీటు మనదే..అక్కడ ఎగరబోయే జెండా కూడా మనదే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే టిడిపి -జనసేనల పొత్తులో భాగంగా జరగబోయే సీట్ల సర్దుబాటులో తెనాలి నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయించడం ఖాయమని పవన్ కళ్యాణే క్లారిటీ ఇచ్చేసినట్లయ్యిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కొద్ది రోజుల క్రితం వారాహి యాత్ర మొదటి విడత ముగింపు సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పొత్తులపై పార్టీ నేతలు ఎవ్వరూ కూడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని ఆదేశించారు. ఎవరెవరితో పొత్తులు ఉంటాయి? అన్న అంశంపై ఎన్నికలకు ముందు మాత్రమే ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అప్పటి వరకు పొత్తుల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు అంత వరకు మనకి ముఖ్యమంత్రి పదవిని ఎవరు ఆఫర్ చేస్తారు? మనకి బలం ఉంటే ఎవరైనా ఇస్తారు కానీ ఊరికే ఎవరూ మనల్ని సిఎంని చేయరు అని స్పష్టం చేశారు.
టిడిపితో పొత్తుకు బిజెపి అగ్రనాయకత్వం సుముఖంగా లేకపోవడంతో పవన్ కళ్యాణే చొరవ తీసుకుని బిజెపి అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వచ్చారు. బిజెపి నాయకత్వం సైతం పదే పదే తాము పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నామని చెబుతున్నారు. పవన్ తమతోనే ఉంటారని తామిద్దరం కలిసే ఎన్నికల బరిలో దిగుతామని అంటున్నారు. ఈ సమయంలోనే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవా అన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని ఇంటికి పంపించడమే తన అజెండా అని పదే పదే చెబుతూ వస్తున్నారు. అందుకోసం విపక్షాలన్నీ కలవక తప్పదని కూడా అన్నారు.
వారాహి యాత్ర రెండు విడతలు పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ హడావిడిలో ఉండిపోయారు. తాజాగా సినిమా పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తో జనసేన నేతల మాటల యుద్ధం నడుస్తోంది. బ్రో సినిమాకి అమెరికా నుండి అక్రమ మార్గంలో నిధులు రప్పించారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడానికి ఆయన రెడీ అయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ టూరులో బిజీగా ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఎన్నికల వరకు మంగళగిరి కేంద్రంగానే రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడే పవన్ కు అనుకూలంగా ఉండేలా అన్ని వసతులతో నివాసాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీలో మకాం ఉండాలని నిర్ణయించుకున్న క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తెనాలి నియోజక వర్గం నుండి నాదెండ్ల పోటీ చేస్తారని ఆయన్ను గెలిపించుకోవలసిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి అధినేత చంద్రబాబు తో తెనాలి సీటు గురించి పవన్ మాట తీసుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. లేదా పవనే ఏకపక్షంగా తెనాలి నుండి పోటీ చేస్తామని ప్రకటించారా అని రాజకీయ పండితులు ఆరా తీస్తున్నారు. బహుశా కొన్ని నియోజక వర్గాలకు సంబంధించి చంద్రబాబుతో డీల్ కుదిరిపోయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..