లోకేష్ పాదయాత్ర డేట్ ఫిక్స్..

By KTV Telugu On 11 November, 2022
image

2023 జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర
ప్రభుత్వంపై దండయాత్రేనంటున్న తమ్ముళ్లు
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ దూకుడు పెంచుతోంది. ప్రభుత్వంపై పోరాటానికి పాదయాత్ర ద్వారా లోకేష్ దండయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్‌ నడవనున్నారు. ఏడాది పాటు ప్రజల్లోనే ఉండేలా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతోంది. ఈ మేరకు పాదయాత్రపై నేతలకు ఆయన స్పష్టత ఇచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా యాత్ర ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తంగా సమీక్షలు నిర్వహిస్తూ, ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. ముందే అభ్యర్థులకు స్పష్టత ఇస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్దులు పార్టీ నేతలు యాత్రలో పాల్గొనేలా బాబు రూపకల్పన చేస్తgన్నారు. ప్రతీ మండలంలో రోడ్ షో ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా వెయ్యిమంది లోకేష్ వెంట ఉండేలా ఇప్పటికే చంద్రబాబు గైడ్ లైన్స్ ఇచ్చారు. లోకేష్ వెంట అడుగులో అడుగు వేసేందుకు యువనాయకత్వాన్ని సంసిద్ధం చేస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పులివెందుల నుంచి ఇచ్చాపూరం వరకు 341 రోజుల్లో 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేసారు. భారీ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దానిని అధిగమించాలనేది లోకేశ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే రాజకీయ పరిణామాలు ఎన్నికల షెడ్యూల్ తదితర అంశాలన్నింటనీ పరిగణలోకి తీసుకున్న తరువాత లోకేశ్ పాదయాత్ర రూట్ మ్యాప్ కు తుది రూపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికల టైంలో లోకేష్ పాదయాత్ర ముగిసేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. లోకేష్ పాదయాత్ర ప్రకటనతో తెలుగుతమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. లోకేష్ తన పాదయాత్రతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారు? పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.