ఆంగ్లంలో నౌ ఆర్ నెవ్వర్.. అన్న సామెత ఉండనే ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధించలేమన్నది దాని అర్థం. నవరస నటనా సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంతేనని చెప్పక తప్పదు. ఏపీలో జగన్ రెడ్డి శక్తిమంతుడిగా ఉన్నారు. పవన్ కల్యాణ్ బలపడినట్లు కనిపిస్తున్నారు. కేఏ పాల్, జడ శ్రవణ్ లాంటి వాళ్లు మేము సైతం అంటూ రెడీ అవుతున్నారు. 2024లో టీడీపీ గెలవకపోతే పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ఆ సంగతి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే కొత్త వ్యూహాలవైపు ఆయన దృష్టి సారిస్తున్నారు. ఆయనకు తనయుడు లోకేష్ తోడు నిలుస్తున్నారు…
పార్టీలో లోకేష్ కీలకమా.. ?
నారా లోకేష్… పార్టీ అధినేత తనయుడాయన. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు. మంత్రిగా చేశారు. పెట్టుబడులను తీసుకురాగలిగారు. ఎన్నో తప్పటడుగులు వేసిన మాట వాస్తవం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. మాటకారి కాకపోవడం, ఛరిష్మా లేకపోవడం, ప్రత్యర్థులు ఆయనకు పప్పు అని పేరు పెట్టడం లాంటివి ఇంతకాలం ప్రతికూల అంశాలుగా మారాయి. పార్టీ ఓటమి పాలైన తర్వాత లోకేష్‌లో పట్టుదల బాగా పెరిగింది. పోగొట్టుకున్న చోటే సాధించాలనుకున్నట్లున్నారు. దానితో వారానికి రెండు పర్యటనలు చేస్తూ జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతున్నారు. టీడీపీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వడం లేదు. చంద్రబాబు తర్వాత తానేనన్న ఫీలింగ్ పార్టీలో కల్పించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు…
పార్టీలో కొత్త రక్తం
కొద్ది రోజులుగా పార్టీలో ట్రెండ్ మారుతోంది. సంస్థాగత మార్పులు అవసరమని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నారు. పనిచేసే వారికే పదవులు ఇస్తామని, క్రియాశీలంగా ఉన్న గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని తేల్చేశారు. మహానాడు వేదికగా ఆయన చెప్పింది కూడా అదే. పార్టీలోకి కొత్త రక్తం ఎక్కిస్తామన్నారు. చంద్రబాబు వారసుడిగా లోకేష్ కూడా అదే క్లారిటీ ఇచ్చారు. 40 శాతం పదవులు యువతకు కట్టబెడతామన్న ప్రకటన నేపథ్యంలో అందుకు మార్గం సుగమం చేసే దిశగా లోకేష్ స్వయంగా కొన్ని ప్రతిపాదనలు, ప్రకటనలు చేశారు. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి 2024లో టికెట్ ఉండదని తేల్చేశారు. కొన్ని నియోజకవర్గాలకు తామే సొంతదారులమని వెన్ను విరుచుకుని తిరిగే వారికి దీన్నో షాక్‌గానే పరిగణించాలి. లోకేష్ ప్రతిపాదన అమలైతే టికెట్ రాని వారిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారు. అటు పార్టీ పదవుల్లోను 2+1 సిద్దాంతాన్ని అమలు చేస్తామన్న ఆయన తాను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని స్పష్టం చేశారు. సంస్థాగతంగా పార్టీలో మార్పు రావాల్సి ఉందన్న ఆయన, ఇక పై పనిచేయని నేతలకు అవకాశాలు ఉండవని హెచ్చరించారు. పార్టీ లైన్లోకి రాని నేతలకు టికెట్లు ఉండవని అంటూ ఇప్పుడు 30 నియోజకవర్గాల్లో నేతలపై నజర్ పెట్టామన్నారు.
రెడీ టు లీడ్
పార్టీని లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ స్వయంగా సంకేతాలిచ్చేశారు. సీనియర్లలో కొందరు పెట్టే బేడా సర్దుకోవాలని ఆయన చెప్పేసినట్లయ్యింది. తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే పాదయాత్ర చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. అంటే త్వరలోనే పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పిన మాట. టీడీపీలో యూత్ కూడా ఇప్పుడు లోకేష్ వైపే చూస్తోంది. గతంలో జరిగింది వేరు.. ఇకపై జరిగేది వేరు అన్నట్లుగా లోకేష్ .. అందరితో టచ్‌లో ఉంటూ నాయకత్వ లక్షణాన్ని కనబరుస్తున్నారు. ఇక టీడీపీ యువత ఎటు చూస్తుందో… కాలమే సమాధానం చెబుతుంది..