తెలుగు రాజకీయ చరిత్ర చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ ముందు.. ఆ తర్వాత అని విభజించుకోవాల్సి ఉటుంది. ఎందుకంటే అప్పటి వరకూ తిరుగులేని విధంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ టీడీపీ ప్రారంభించినప్పటి నుండే గడ్డు పరిస్థితి ఎదురయింది. 1980ల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుండేది కాదు. ప్రత్యామ్నాయమే లేదు. దాంతో ఆ పార్టీది ఇష్టారాజ్యం అయిపోయింది. పైగా అంతా ఢిల్లీ పెత్తనం. తెలుగు నేతలకు కనీస గౌరవమర్యాదలు కూడా దక్కేవి కాదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలని ఎన్టీఆర్ సంకల్పించారు. తెలుగుదేశం ప్రారంభించారు.
ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాత మారిపోయిన రాజకీయాలు !
ఆయన గెలుస్తారని ఎక్కువ మంది నమ్మలేదు.. ప్రభంజనం సృష్టిస్తారని ఎలా అనుకుంటారు ? ముఖానికి రంగు పూసుకునే వాళ్లు రాజకీయాల్లో ఏం చేస్తారులే అని లైట్ తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం అలా అనుకోలేదు. చరిత్ర గతిని మార్చే నాయకుడ్ని తయారు చేస్తున్నామని వారు డిసైడయ్యారు. ఫలితంగా టీడీపీ మహోద్యమంగా రాజకీయ తెర ముందుకు వచ్చింది. నిజానికి టీడీపీ విజయం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ రాజకీయాలకే మలుపు తిప్పింది. తొలి విజయం తర్వాత ఎన్టీఆర్ తొలి మహానాడు నిర్వహించాలని నిర్ణయించి ఆహ్వానిస్తే… అప్పటి దేశంలో ఉన్న దిగ్గజాలంతా హాజరయ్యారు. ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు, ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్డే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, మేనకాగాంధీ కూడా హాజరయ్యారు. అప్పట్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న అందరూ మహనాడు వేదిక మీదకు వచ్చారు. అంటే తొలి అడుగులోనే ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
కాంగ్రెస్‌కు చెక్ పెట్టి ప్రజా రాజకీయాలు !
తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న బడుగు, బలహీనవర్గాల నాయకులంతా టీడీపీ నుంచి వచ్చిన వారే. ఎన్టీఆర్ బడుగులకు రాజ్యాధికారం ఇచ్చేందుకు ఏ మాత్రం సంకోచించలేదు. తెలంగాణలో ఇలాంటి వారు మరీ ఎక్కువ. ఇప్పుడు అధికార పార్టీలోనే కాదు.. అన్ని పార్టీల్లో చక్రం తిప్పుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల్లో అత్యధికులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారే. సంక్షేమ పథకాలు కానీ.. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఆయన రాజకీయాలు చాలా సూటిగా ఉంటాయి.
తెలుగు రాజకీయం ఉన్నంత కాలం ఎన్టీఆర్ చెరగని చరిత్ర !
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను తట్టుకుని నిలబడగలని నిరూపించిన నేత ఎన్టీఆర్. ఇందిరాగాంధీ కుట్రలు చేధించుకుని… నిలబడిన నేత. ప్రారంభమే సంచలనం.. అది ఎంత సంచలనం అంటే.. నలభై ఏళ్ల తర్వాత కూడా ప్రభావం చూపేంత. ఆ పథకాలే ఇప్పటికీ కొనసాగించేంత. ఏ పార్టీ అయినా ఆయనను గుర్తు చేసుకోకుండా ఉండలేనంత. సినిమాల్లో ఆయనో శిఖరం అయితే.. రాజకీయాల్లో ఎవరెస్ట్. అందుకే తెలుగు రాజకీయాలు ఇప్పటికీ ఎన్టీఆర్‌తో ముడిపడి ఉన్నాయి.