ఏపీకి ఇదేం ఖర్మ..

By KTV Telugu On 2 December, 2022
image

టీడీపీకి పోటీగా వైసీపీ ఫ్లెక్సీలు
రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటోన్న బాబు
నువ్వే మా ఖర్మ అంటోన్న వైసీపీ

ఏపీలో విచిత్ర పేర్లతో జనంలోకి వెళ్తోన్న చంద్రబాబుకు వింత అనుభవం ఎదురవుతోంది. చంద్రబాబు నినాదాన్ని తిరిగి ఆయనపైనే ప్రయోగిస్తోంది అధికార వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలకు ముందు, తర్వాత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే టైటిల్‌ను జోడిస్తూ జగన్‌ సర్కార్‌ను తిట్టిపోస్తున్నారు. అయితే ఆ టైటిల్‌తోనే బాబుపై ఎదురుదాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు. మొన్న దెందులూరు, చింతలపూడిలో బాబు పర్యటన నేపథ్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఇదే మా అదృష్టం చంద్రబాబు నువ్వే మా ఖర్మ అంటూ వైసీపీ పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొయ్యలగూడెంలోనూ ఇదేవిధమైన పోస్టర్లు వెలిశాయి. తాడేపల్లి గూడెం పర్యటనలోనూ టీడీపీకి పోటీగా రాత్రికి రాత్రే వైసీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్ర‌బాబును ఉద్దేశించి బాబు హయాంలో వైఫ‌ల్యాల‌ను ప్ర‌స్తావిస్తూ వాటిని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు చేపడుతున్న జిల్లాల టూర్ల పై వైసీపీ సర్కార్ కు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు నివేదికలు అందిస్తున్నాయి. బాబు పర్యటనకు తరలివస్తున్న జనం ఎవరు కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే వస్తున్నారా లేక సాధారణ ప్రజలు కూడానా అనే విషయంపై సమాచారం వెళ్తోంది. దాంట్లో భాగంగానే బాబు టూర్లకు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయడం మొదలుపెట్టారు. మొన్న కర్నూలుతో మొదలైన బాబు జిల్లాల యాత్ర కంటిన్యూగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ బాబు ముందుకు సాగుతున్నారు. అయితే బాబు టూర్‌పై నిఘా పెట్టిన వైసీపీ తమ శ్రేణులను రంగంలోకి దింపుతోంది. చంద్రబాబు పర్యటనలో దర్శనమిస్తున్న వైసీపీ ఫాలోవర్స్ అక్కడక్కడ ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు. బాబును పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు బైబై అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి టైటిల్ పూర్తిగా నప్పిందని అంటున్నారు బాబు. తన కంటే ప్రజలు ఎక్కువ ఆవేశంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయంటూ లాజిల్ లేని మాటలు మాట్లాడుతున్నారు. మొన్న కర్నూలుకు వెళ్లి తనను గెలిపించకపోతే పోటీ చేసేది లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఇప్పడేమో రాష్ట్రానికి ప్రజలకు ఇదే లాస్ట్ ఎన్నికలు అంటున్నారు. ఇదంతా గమనిస్తున్న వారు చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. వయోభారం కారణంగా బాబు తనకు ఇదే చివరి ఎన్నిక అని చెప్పుకోవడంలో అర్థముంది. కానీ ఏకంగా ప్రజలకే లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా ఉందంటున్నారు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, సింధూకు బ్యాడ్మింటన్ నేర్పించానంటూ సంబంధం లేని విషయాలు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటేనంటూ ప్రత్యర్థులు సెటైర్లు పేలుస్తున్నారు.