తెలంగాణ బీజీపీలో కనిపించని సంక్షోభం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచి పార్టీకి ఓ ఊపు తీసుకు వచ్చిన ఈటల రాజేందర్ ను పార్టీ హైకమాండ్ హఠాత్తుగా పిలిపించి మాట్లాడటమే దీనికి కారణం. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈటలతో పాటే ఆయన కూడా టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కానీ ఆయనను బీజేపీలో పట్టించుకోవడం లేదు. ఈటల రాజేందర్ హుజురూబాద్ నుంచి గెలిచిన తర్వాత ఒక్క సారిగా హైప్ వచ్చింది. ఆ తర్వాత ఆయనను వ్యూహాత్మకంగా రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టేసింది. ఫలితంగా ఈటల రాజేందర్ ఎప్పుడైనా సభలు.. సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అక్కడా ఆయనకు పెద్దగా ప్రయారిటీ లభించడం లేదు.
ఇటీవల బండి సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా బీజేపీకి గుడ్ బై చెప్పి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీ బలోపేతానికి ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకుంటారని అనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు. కానీ అలాంటి పనులేమీ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్‌కు తన వేదన వినిపించుకోవడానికి కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయన్న వాదన వినిపిస్తోంది. ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకునేటప్పుడు చాలా హామీ ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అయితే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని అమిత్ షా ఈటలకు హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారం, రెండు వారాల్లో ఈటలకు బీజేపీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో వచ్చే నెల 2 నుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత భారీ బహిరంగసభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం ఈటల అసంతృప్తిని తగ్గించి… కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటల సేవలను విస్తృతంగా వినియోగించుకోవడంలో భాగంగా ఆయనకు పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పదవి కట్టబెట్టబోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.
అదృష్టమో.. ఇతర సీనియర్ల కష్టమో కానీ బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ కాస్త బలపడింది. దీంతో మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఆయనకే ఉంటున్నాయి. అయితే సీనియర్ల పరిస్థితే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. బండి సంజయ్ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పట్టించుకోవడం లేదు. వారి ఫోటోలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ తరపున ఏదైనా కార్యక్రమం జరిగితే ఎక్కడా… ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల ఫోటోలు ఉండవు. తమను గౌరవించడం లేదని వారంతా అసంతృప్తిగానే ఉన్నారు.
ఈటల రాజేందర్‌పై బండి సంజయ్ అసంతృప్తిగా ఉన్నారు. టిక్కెట్ల విషయంలో ఆయనచాలా మందికి హామీలిచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని తెలియడంతో అలా హామీ ఇచ్చే వారికే టిక్కెట్లు రావని బండి సంజయ్ హెచ్చరించారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా సీనియర్ నేతలు ఒకటి, రెండు సార్లు వ్యతిరేకంగా భేటీ కూడా నిర్వహించారు. వారికి పార్టీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో కిషన్ రెడ్డి సీనియర్లకు మద్దతుగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. మోదీ, అమిత్ షా నుంచి వచ్చిన ప్రోత్సాహంతో బండి సంజయ్ మరింత ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక తమను పట్టించుకోరని ఆందోళనకు గురవుతున్నారు. తమకు నిరాదరణ ఎదురవుతుందని సీనియర్లు ఎక్కువగా భావిస్తే అది బీజేపీకే నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ అసంతృప్తిని పార్టీ హైకమాండ్ గుర్తించడంతోనే ఈటలను పిలిపించి మాట్లాడిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే బండి సంజయ్ కు పోటీగా ఈటలను ప్రోత్సహించి.. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రచార కార్యదర్శి పదవి ఇస్తే ఆయన రాష్ట్రం మొత్తం తిరిగే చాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని బండి వర్గం సహిస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎలా చూసినా ఈటలకు ప్రాధాన్యం దక్కకపోతే ఆయన తన దారి తాను చూసుకుంటారు.. దక్కితే బీజేపీలో వర్గపోు బహిరంగం అవుతుంది. బీజేపీ హైకమాండ్‌కు కత్తిమీద సామే అనుకోవచ్చు.