తెలంగాణ సీఎం కేసీఆర్..టీడీపీ అధినేత చంద్రబాబు పేరు వింటేనే గయ్యిమని లేస్తాడు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తన మాజీ బాస్‌ను ఫాలో అవుతున్నారు. గతంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడలనే ఈయన అనుసరిస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో కేంద్రంతో రాసుకుపూసుకు తిరిగారు. చివరికొచ్చేసరికి బీజేపీ నుంచి విడిపోయి మోదీని తీవ్ర పదజాలంతో విమర్శించారు. కేంద్రం ఐటీ, ఈడీ విభాగాలతో తమ నేతల మీద దాడులు చేస్తూ వేధిస్తోందని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా ఏపీలోకి సీబీఐ ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇప్పుడు కేంద్రంతో పేచీ పెట్టుకున్న కేసీఆర్ కూడా అదే పని చేశారు. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంటూ ఒక రహస్య జీవోను విడుదల చేశారు. సీబీఐకి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఇన్నిరోజులు సీక్రెట్‌గా ఉన్న ఈ జీవో తాజాగా బయటపడింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఈ ఉత్తర్వుల కారణంగా రాష్ట్రంలో ఏదైనా కేసులో సీబీఐ విచారణ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వివిధ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 30న సీబీఐకి నో చెబుతూ జీవో వచ్చిన మరుసటి రోజునే కేసీఆర్ బీహార్ వెళ్లి నితిష్ కుమార్‌ను కలుసుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్తులపై సీబీఐ తో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పుతోందని, ఆ సంస్థలను రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలని పిలుపునిచ్చారు. అయితే అంతకు ఒక్కరోజు ముందు తాను తెలంగాణలో సీబీఐ కట్టడికి ఇచ్చిన జోవో గురించి మాట మాత్రంగానైనా చెప్పలేదు.
ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం.. ఒక్క ఢిల్లీ మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ సీబీఐకి నేరుగా దర్యాఫ్తు చేసే అధికారంలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ సమ్మతి తోనే కేసు విచారణను చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతిని ఈ చట్టం తప్పనిసరి చేసింది. గతంలో సమ్మతి తెలిపి ఆ తర్వాత ఉపసంహరించుకున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లోనూ 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కారు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను పురుద్ధరించారు. సీబీఐకి నో ఎంట్రీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రెండు నెలల క్రితమే జీవో ఇస్తే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సిబీఐ భయం పట్టకుందని విమర్శించారు.