రేవంత్ వ్యతిరేక వర్గీయుల “చింతన్ శిబిరం”! నివురుగప్పిన నిప్పులా టీ కాంగ్రెస్ !

By KTV Telugu On 1 June, 2022
image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సాఫీగా లేదు. అంతర్గతంగా తీవ్ర ఆధిపత్య పోరాటం నడుస్తోంది. నిన్నామొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తమను దాటిపోతున్నారన్న ఉద్దేశంతో  ఉన్న సీనియర్ నేతలు ఎలాగైనా తమ ప్రభావం చూపాలన్న పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి అమెరికా టూర్ వారికి బాగా కలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ అటు వెళ్లగానే ఇటు భట్టి విక్రమార్క్ నేతృత్వంలో చింతన్ శిబిరం నిర్వహిస్తామని ప్రకటించేశారు. రేవంత్ అమెరికా నుంచి రాక ముందు ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నారు . ఇందులోనే అసలు కార్యాచరణ సిద్ధం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

భట్టిని ముందు పెట్టి రాజకీయం ప్రారంభించిన రేవంత్ వ్యతిరేక వర్గం !

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు.. ప్రకటించినప్పుడు సీనియర్లు పెద్దగా స్పందించేవారు కాదు. చివరికి రచ్చబండ విషయంలోనూ అంతే. అయితే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లగానే ఇటు ఆయన వ్యతిరేక వర్గం ఇప్పుడు ఒక్క సారిగా యాక్టివ్ అయింది. భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఆ వర్గం ప్రత్యేకంగా చింతనన్ శిబిరం నిర్వహిస్తోంది. కీసరలో రెండు రోజులపాటు నవ సంకల్ప శిబిర్ పేరుతో మేథో మధన సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది మొత్తం భట్టి విక్రమార్క డీల్ చేస్తున్నారు. అన్నీ తానే ముందుండి చూసుకుంటున్నారు. ఈ సమావేశంలో రేవంత్ వ్యతిరేకవర్గంగా భావిస్తున్న వారంతా పాల్గొంటున్నారు. వారిదే కీలక పాత్రగా చెబుతున్నారు. మొత్తంగా ఆరు కమిటీలు వేస్తే.. ఆరు కమిటీలకు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి,  దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వీహెచ్ హనుమంతరావు లు నేతృత్వం వహిస్తున్నారు. వీరందరూ రేవంత్‌కు వ్యతిరేకకులే.

శిబిరానికి రాని వాళ్లు కూడా తెర వెనుక సాయం !

రేవంత్‌ను వ్యతిరేకించే మరో నేత ఏలేటి మహేశ్వరర్ రెడ్డి ఈ శిబిరం బాధ్యతలు తీసుకున్నారు. ప్రచార కమిటీ  చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ కూడా రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా ఆయన రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి .. రెడ్డి సామాజికవర్గం గురించి చేసిన వ్యాఖ్యనాలు.. ఆయన వ్యూహాత్మకంగా హైకమాండ్‌కు ముడిపెట్టి వారిని రేవంత్ అవమానించారని చెప్పుకొచ్చారు. సాధారణంగా ఇలాంటి విమర్శలు విపక్షాలు చేస్తాయి. కానీ ఇక్కడ రేవంత్ ను టార్గెట్ చేసి సొంత వర్గమే చేస్తోంది. కారణం ఏదైనా రేవంత్ వ్యతిరేక వర్గ భేటీగా ఈ చింతన్ శిబిరం ప్రచారంలోకి వచ్చింది.

రేవంత్ వర్గీయులు ఊరుకుంటారా ?

అయితే పార్టీ కోసమే తాము చింతన్ శిబిరం నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క చెబుతున్నారు.  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన నవ సంకల్ప శిబిరంలో లోతుగా చర్చించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటామని బట్టి విక్రమార్క చెబుతున్నారు. అయితే ఏంటీ… రేవంత్ రెడ్డి లేకుండానేనా అని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. అయితే  ఇందులో రేవంత్ వర్గీయులు చొరబడి అలజడి రేపితే కాంగ్రెస్ పార్టీకి మరోసారి తనదైన రాజకీయాల్లోకి హెడ్ లైన్స్‌లోకి వస్తుంది. పీసీసీ చీఫ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి శిబిరం నిర్వహిస్తే ఏమవుతుందని.. అంత తొందర ఎందుకని ఆయనకు మద్దతుగా ఉండేవారు ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ మాటలు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు లెక్క చేసే పరిస్థితి లేదు. వారి గ్రూప్ రాజకీయాలు వారు చేసుకుంటున్నారు.  అందుకే క్యాడర్ కూడా డీలాపడిపోతున్నారు. ఓ భారీ కార్యక్రమం నిర్వహించడం.. ఊపు వచ్చిందని అనుకోవడం.. గ్రూపు రాజకీయాలతో తంటాలు పడిపోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది.