టీ కాంగ్రెస్ లీడర్స్ కి ఈ లాజిక్ అర్థమవుతుందా?

By KTV Telugu On 28 June, 2022
image

విజయానికి, పరాజయానికి ఎంతో తేడా ఉండదు.  వంద కొడితే గెలుస్తామనుకున్నప్పుడు కష్టపడి 99 కొట్టినా ఓటమే. ఆ ఒక్కటి కొడితే గెలుపు వచ్చేది కానీ కొట్టలేకపోయారు. అసలు ఎదుటి వ్యక్తికి 100 టార్గెట్ ఇవ్వగలిగేలా చేయడంలోనూ ప్రత్యర్థి లోపాలు ఉంటాయి.  మధ్యలో ఎక్కడో మిస్ ఫీల్డింగ్ చేసో… వైడ్లు వేసో…నోబాల్స్ వేసో ఎదుటి వ్యక్తికి  అదపున స్కోర్ ఇచ్చేసి ఉంటారు. అలాగే బ్యాటింగ్‌లో సమన్వయలోపంతో కొన్ని పరుగులు పోగొట్టుకుని ఉంటారు. ఇవన్నీ ఆటలో భాగంగానే యాధృచ్చికంగా జరిగపోవు. ఆటగాళ్లు చేస్తారు. అలా చేయకుండా ఉండేందుకే నిపుణుల వ్యక్తులు.. కోచ్‌లుగా.. ఇతర రూపాల్లో బయట నుంచి అంటే బ్యాక్ గ్రౌండ్‌లో సహకారం అందిస్తారు. అలాంటి లోపాలు ఎంత తగ్గించుకుని ఎదుటి వాళ్ల స్కోర్‌ను తగ్గించడం.. మన స్కోర్‌ను పెంచుకోవడం వంటివి చేసుకుంటామో విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది కేవలం క్రికెట్.. సాకర్ లాంటి ఆటలకే కాదు… అసలు అన్ని ఆటలకు మదర్ లాంటి పొలిటికల్ గేమ్‌కూ అవసరం. ఈ సూక్ష్మం తెలుసుకున్నవారు విజయాలు సాధిస్తూనే ఉన్నారు. అయితే అంతా మాకు తెలుసు అనుకుంటున్న కొంత మంది నేతల వల్ల ఆయా పార్టీలకూ ఎడ్జ్ మిస్సవుతోంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉందని ఎక్కువ మంది ఫీలింగ్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్ట్రెయిట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్‌లో ఆయనకు కావాల్సిన సహకారం మాత్రం అందడం లేదు. కోచ్ లాంటి క్యారెక్టర్ కనిపిచడం లేదు. ఆ క్యారెక్టర్ కేవీపీ రూపంలో రెడీగా..   ఎవైలబుల్‌గా ఉందని తెలిసినా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేక ముందు..  ఆయనకు పార్టీలో యాభై శాతం వరకూ మద్దతు ఉండేది. కానీ సీఎం అయనకు మద్దతు పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. వన్ అండ్ ఓన్లీ నాయకుడిగా కాంగ్రెస్ నేతలందరూ ఆమోదించారు. ఇలా నేతలందర్నీ ఏకతాటిపైకి తేవడానికి కారణం కేవీపీ రామచంద్రరావు, వైఎస్ ఆత్మగా ప్రచారంలోకి వచ్చిన ఆయన వైఎస్ తరపున కాంగ్రెస్ నేతల్ని డీల్ చేసేవారు. ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా అందర్నీ వైఎస్ ఫ్యాన్స్‌గా మార్చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఎంతగా అంటే.. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు కేవీపీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన సలహాలను గొప్పగా భావిస్తారు. పాటిస్తారు.

కేవీవీ కూడా తను వైఎస్ ఆత్మ … వైఎస్ అంటే కాంగ్రెస్ మాత్రమే అని డిసైడయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ కుమారుడు వేరే పార్టీ పెట్టుకుని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ వైఎస్ఆర్‌కాంగ్రెస్‌గా మారిపోయింది. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా పొరాడుతోంది. ఇలాంటి  పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ ఏకతాటిపైన ఉంచడంలో కీలకంగా వ్యవహరించిన కేవీపీ సేవలు ఎంతో మేలు చేస్తాయనడంలో రాజకీయవర్గాలకు ఎలాంటి సందేహం లేదు.. అయితే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒంటరిగానే అన్నీ చేసుకుంటున్నారు. కొన్ని ఆయన చేయగలిగినప్పటికీ కొన్ని అంశాలను మాత్రం నేరుగా చేయకూడదు.. చేయించగలగాలి. నేతల మధ్య సమన్వయం సాధించాలంటే ఖచ్చితంగా అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న సీనియర్ ఉండాలి. ఆయన కేవీపీ రూపంలో కాంగ్రెస్ పార్టీకి రెడీగా ఉన్నారు.

కేవీపీ తెర వెనుక రాజకీయాలు చేయడంలో దిట్ట. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆయన నిబద్ధతను శంకించాల్సిన అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. కానీ ఆయన ఎంత లేదన్నా… నిన్నామొన్నత కాంగ్రెస్ లోకి వచ్చిన నేత. కరుడు గట్టిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ దూకుడు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని ప్లస్ చేసుకునేందుకు ఇప్పుడు కేవీపీ లాంటి నేత రేవంత్ రెడ్డికి చాలా అవసరం. బ్యాక్ గ్రౌండ్ లో పనుల్ని చక్కబెట్టగలిగితే.. నేరుగా గ్రౌండ్‌లో రేవంత్ సిక్సులు కొట్టొచ్చు. పార్టీ పరంగా జరిగే వ్యూహాత్మక తప్పిదాల్ని నివారించవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లుగా ఎదుటి వ్యక్తి స్కోర్ ను నియంత్రించడమే కాకుండా.. సొంత స్కోర్‌నీ పెంచుకోవచ్చు. పొలిటికల్ గ్రౌండ్‌లో అందరూ సమఉజ్జీలే అయినప్పుడు… తెర వెనుక వ్యూహాలే విజయాల్ని డిసైడ్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి అర్థమవుతుందా మరి !