పదేళ్ల తర్వాత దెబ్బ? ఓవైసీలను రేవంత్ లాగేశారా…?

By KTV Telugu On 1 June, 2022
image

ఎంఐఎం సైడ్ మారుతోందా? ఇన్నాళ్లూ టీఆర్ ఎస్ తో దోస్తీలో ఉన్న ఓవైసీలు కాంగ్రెస్ వైపు చూస్తారా? రేవంత్ స్కెచ్ రెడీ చేశారు.. ఎంఐఎం గనక టీఆర్ ఎస్ ని వదిలి కాంగ్రెస్ వైపు జరిగితే తెలంగాణ రాజకీయం మారుతుందా? ఓసారి చూద్దాం.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ముస్లిం జనాభా 12.7 శాతం ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు వరకు కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉండేవారు. అంతకుముందు టీడీపీకి ఓవైసీ కుటుంబం అండగా ఉండేది. తర్వాత పరిస్థితులు మారడంతో వె.ఎస్. రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ వెంట నడిచింది. వైఎస్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి శైలితో కాంగ్రెస్ కు ఎంఐఎం దూరమైంది. అదే ..ఎన్నికల్లో కాంగ్రెస్ కు మైనస్ పాయింట్ అయింది. అయినా ఎన్నికల్లో గెలిచే పార్టీ వైపే ఎంఐఎం సైడ్ తీసుకుంటూ ఉంటుందన్న మాట ఊరికే పోలేదు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినా చివరకు ఎంఐఎం మద్దతోనే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.

బీజేపీ కొత్త నినాదం

వచ్చే ఎన్నికల్లో ఈ బంధాన్ని ఎదిరించి తెలంగాణ గడ్డపై జెండా ఎగరేద్దామనుకుంటున్న బీజేపీ కొత్త నినాదం అందుకుంది. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లిం కోటా అంశాన్ని ప్రముఖంగా ప్రస్తవిస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన వైఖరిని రెట్టింపు చేసింది.మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ప్రకటించింది. మతం ఆధారంగా మైనారిటీ రిజర్వేషన్లకి తాము పూర్తి వ్యతిరేకమని హైదరాబాద్ సభలో అమిత్ స్పష్టం చేశారు.

రెండు పార్టీలు ఉప్పు, నిప్పులా ఎప్పూడు రగిలిపోతుంటాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు తాపత్రయపడుతున్న ఎంఐఎంను నడిపిస్తోంది బీజేపీనేనని ప్రచారం ఉంది. అలాగని ఎక్కడా రెండు పార్టీలు నేరుగా చేతులు కలపలేదు. ఎవరు ఎన్ని చేసినా ఎంఐఎంకి ఉన్న ఓటు బ్యాంకు మాత్రం ఫిక్స్ . 16 స్థానాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల శక్తి ఓవైసీ సోదరులకు ఉంది. అందుకే ఈసారి మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. పరిస్థితులను తమకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న కాంగ్రెస్ ఎంఐఎం మనసు మార్చే పనిలో ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ ఎంఐఎంను రేవంత్ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే దూరమైన ఓటు బ్యాంకు పార్టీకి దగ్గరవుతుంది. త్రిముఖ పోటీలో ప్రతీ ఓటు కీలకమైన వేళ..మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ తలరాతను మార్చేస్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి సంతకం పెడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భరోసా ఇస్తూ దగ్గరవుతున్నారు.

ముస్లిం కోటా పెంపు అంత సులువు కాదు

స్తవానికి రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1992 నాటి సుప్రీం తీర్పును పునః పరిశీలనకు ధర్మాసనం నిరాకరించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే మరాఠా రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పరిస్థితుల్లో ముస్లింకోటా పెంపు అంత సులువుగా కాదు. బీజేపీ రిజర్వేషన్లకి వ్యతిరేకమని విపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి . అయితే ఈబీసీ కోటాను సృష్టించి మోదీ అగ్రవర్ణాలను పార్టీకి దగ్గర చేశారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది. ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం చేసి ముస్లిం మహిళలను కాషాయపార్టీ తన వైపునకు తిప్పుకుంది. ముస్లింలకు తాము వ్యతిరేకంగా కాదని సంకేతాలిచ్చారు.

కేంద్రం 2018లో మొదటిసారిగా బీసీల కోసం ప్రత్యేకంగా 102వ రాజ్యాంగ సవరణ చేస్తూ 338బి అధికరణను చేర్చింది. దీని ద్వారా జాతీయ బీసీ కమిషన్ కు శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగబద్ధ హోదా దక్కింది. ఓబీసీ కులాల జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడం లేదా తొలగించే అధికారంతో పాటు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలును సమీక్షించే వెసులుబాటు జాతీయ బీసీ కమిషన్ కు కల్పించారు. జాతీయ బీసీ కమిషన్ కు ఎలాంటి అధికారాలు కల్పించారో అలాంటి అధికారాలే రాష్ట్ర బీసీ కమిషన్ కు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బీసీ కమిషన్ కు పరిమిత అధికారాలే ఇచ్చింది. ఏదైనా బీసీ కులాన్ని రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చడం లేదా తొలగించడం వరకే దాన్ని పరిమితం చేసింది. ఈ అంశాన్ని బీజేపీ తెలివిగా వాడుకోవాలనుకుంటోంది. మైనారిటీలు మినహా మిగిలిన వర్గాలు తమ వైపు వస్తే విజయం నల్లేరుపై నడకేనని నమ్ముతోంది.