అప్పులు ఆపితే కేసీఆర్ లొంగిపోతారా ? బీజేపీ చేస్తోంది రాజకీయమేనా ?

By KTV Telugu On 17 May, 2022
image

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీనికి కారణం ఆదాయం లేకపోవడమో.. మరో కారణమో కాదు. చట్టబద్ధంగా రావాల్సిన అప్పులను కేంద్రం నిలిపివేయడం. ఎన్ని వివరాలు అడిగినా చెబుతున్నప్పటికీ అప్పులకు అనుమతి విషయం మాత్రం తేల్చడం లేదు. దీంతో తెలంగాణ సర్కార్ ఆర్థిక చిక్కుల్లో పడింది. తెలంగాణ ప్రభుత్వానికి ఊపిరి ఆడని పరిస్థితి తీసుకు వస్తే సీఎం కేసీఆర్ దారికి వస్తారని భావిస్తున్నట్లుగా ఉన్నారు బీజేపీ నేతలు. అయితే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. అన్నింటికీ మించి తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం పడుతోంది. రాజకీయం రాజకీయంగా చేసుకోవాలి కానీ ఇలా ఆర్థికంగా దిగ్భంధనం చేయడం ఏమిటన్న చర్చ తెలంగాణ అంతటా నడుస్తోంది.

అప్పులతో ఉత్పాదక వ్యయం చేస్తున్న తెలంగాణ !

తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోంది సంక్షేమ పథకాలకు పంచడానికి కాదు. పెట్టుబడి కోసమే. అంటే ఆస్తులు పెంచడానికే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ రుణాలే కాకుండా.. వివిధ కార్పొరేషన్ల పేర గ్యారంటీ రుణాలూ తీసుకుంటోంది. వీటిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తున్నందున.. వాటిని ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని, వీటినీ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పరిధిలోకి తెస్తామని చెబుతోంది. గ్యారంటీ అప్పులను కలిపితే రాష్ట్ర అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించిపోతున్నాయని, ఇది ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించినట్లవుతుందని అంటోంది. ఈ వాదనను విభేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపినట్లు సమాచారం. ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా గుర్తించి, అప్పులపై అభ్యంతరం వ్యక్తం చేయవద్దని కోరుతోంది. కానీ కేంద్రం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు.

ప్రజా వ్యతరేకత పెంచడానికేనా ?

అప్పు పుట్ట‌ని ప‌రిస్థితి తెలంగాణ‌కు తీసుకురాగ‌లిగితే సంక్షేమంవైపు, అభివృద్ధివైపు చేయాల్సిన ప‌నుల‌న్నీ ఆగిపోయి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని బీజేపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వ్య‌తిరేక‌త రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నారు. ఏపీలో లోపాయికారీగా స‌హ‌క‌రిస్తున్న ప్ర‌భుత్వం ఉంది కాబ‌ట్టి నిబంధ‌న‌లు పాటించ‌కుండా కేంద్రం అనుమ‌తి మంజూరు చేస్తోంద‌ని తెలంగాణ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. అదే తెలంగాణ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి నిబంధ‌న‌లంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. అధికారులు అప్పు ఎందుకు చేయాలో పార‌ద‌ర్శ‌కంగా లెక్క‌లు వివ‌రించిన‌ప్ప‌టికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఇరు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరుధ్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన‌లా మారే ప్ర‌మాదం క‌న‌ప‌డుతోంది.

తెలంగాణపై చేస్తోంది ఆర్థిక యుద్ధమే !

రిజర్వుబ్యాంకు ఇటీవల ప్రకటించిన లెక్కల ప్రకారం 2022 మార్చి నాటికి తెలంగాణ జీఎస్‌డీపీలో ఔట్‌స్టాండింగ్‌ లయబిలిటీ 27.4 శాతం ఉంది. కాగా పంజాబ్‌ 53.5 శాతం, కేరళ 38.3 శాతం, పశ్చిమ బెంగాల్‌ 38.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 37.6 శాతం ఉన్నాయి. రెండు మూడు తప్ప అన్ని రాష్ర్టాలూ తెలంగాణ ఔట్‌స్టాండింగ్‌ లయబిలిటీ కంటే ఎక్కువగా అప్పులు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం వివక్ష చూపుతున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తెలంగాణ రాష్ట్రం అప్పులను కావాలనే కేంద్రం ఆలస్యం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని తెలంగాణపై కేంద్రం సాగిస్తున్న ఆర్థిక యుద్ధంగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ ఏం చేయబోతున్నారు ?

అప్పులు పుట్టకుండా చేయడంలో కేంద్రం రాజకీయం చేస్తోందన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన విభిన్నమైన వ్యూహంతో తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం అడ్డగోలుగా అప్పులు దొరకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ కూడా ప్రత్యక్ష కార్యాచరణ ఖరారు చేసే చాన్స్ కూడా కనిపిస్తోంది.