తెలంగాణకు ఏమయింది..? ధనిక రాష్ట్రం. కానీ ఉద్యోగులకు జీతాలు మాత్రం సమయానికి రావడం లేదు. ఒక్కహైదరాబాద్ ప్రాంతంలో పనిచేసేవారికి మాత్రం జీతాలు ఒకటో తేదీ ఇస్తున్నారు. జిల్లాల్లో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి. తెలంగాణ ఆర్థిక కష్టాల్లో ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ గత కొన్నాళ్లుగా జీతాలు ఒకటో తేదీన ఇవ్వడం లేదు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ కల్లా ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. హరీష్ రావు మాటలు విని ఉద్యోగులు నిజమైతే బాగుండు అని అనుకున్నారు. కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదు.
ఏపీలోనే కాదు తెలంగాణ ఉద్యోగులకూ జీతాలు లేటే !
ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయన్న విషయమే బాగా ఫోకస్ అయింది. కానీ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. దీన్ని హరీష్ రావు కూడా నేరుగా ఒప్పుకున్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గిపోయి జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. తెలంగాణలో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ సంఘాలేవీ నోరు తెరిచే పరిస్థితి లేకపోవడంతో పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ చేరిందని… కొద్ది రోజులు ఆగితే దివాలా తీస్తుందని బండి సంజయ్, కిషన్ రెడ్డి తరచూ ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికే హరీష్ రావు ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి దేశం కన్నా తెలంగాణ చాలా బెటర్‌గా ఉందని లెక్కలు చెప్పుకొచ్చారు. కానీ ఎంత బెటర్‌గా ఉన్నా ఉద్యోగుల జీతాలకు కష్టం అవుతున్న విషయం మాత్రం స్పష్టమయింది.
అప్పులు గుది బండలా మారిపోయాయా ?
తెలంగాణ రాష్ట్రం ఇష్టారాజ్యంగా.. తలకు మించిన అప్పులు చేస్తోందన్న విమర్శలు కొంత కాలంగా ఉన్నాయి. 2016లో జీఎస్డీపీలో 17% రుణాలు ఉండగా.. అది 2019కి 22.9శాతానికి చేరాయి. ఇప్పుడు అవి 30 శాతం దాటిపోయాయి. ఈ అప్పులన్నింటినీ తిరిగి చెల్లించడమెలా అనేదానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ.. అందుకు తగ్గ ఫలితాలు రాలేదని భావిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడిందని గతంలో కాగ్ విడుదల చేసిన నివేదికలో ఉంది. చేసిన అప్పులు వాటికి తిరిగి చెల్లింపులతో తెలంగాణ సర్కార్ ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది.
కొత్త పథకాలతో ఇక్కట్లు !
తెలంగాణ ప్రభుత్వం రుణాలు తీసుకుని చెల్లించడం లేదంటూ కొన్ని బ్యాంకులు గవర్నర్లకు ఫిర్యాదు చేస్తున్నాయి.తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు జారీ చేసిన పవర్ బాండ్ల గడువు ముగిసినప్పటికీ చెల్లింపులు చేయడం లేదని యాక్సిస్ బ్యాంక్ గవర్నర్లకు ఫిర్యాదు చేశాయి. 2021 సెప్టెంబర్ 9 నాటికి ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కోలు రూ.156.70 కోట్లు చెల్లించాల్సి ఉందని లేఖలో తెలిపింది. ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇలాంటివి బయటకు వచ్చినవే. బయటకు రానివి చాలా ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రవేశ పెట్టారు. రూ. రెండు వేల కోట్లను మళ్లించారు . అప్పుల తిరిగి చెల్లింపులు.. జీతాలు ఆలస్యం చేస్తూ పథకాలకు ఖర్చు పెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆర్థికాభివృద్దిలో తెలంగాణ నెంబర్ వన్ !
ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్డీపీ ఏడేళ్లలోనే రెట్టింపు అయింది. తెలంగాణ అభివృద్దిని కరోనా కూడా ఆపలేకపోయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది. విద్యుత్, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు అయింది. ఇంత అభివృద్ధి సాధిస్తున్నా ఆర్థిక కష్టాలు ఎందుకో.. తెలంగాణ సర్కారే సమీక్ష చేసుకోవాల్సి ఉంది. లేకపోతే తెలంగాణ సర్కార్ కూడా రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది.