తెలంగాణ సీఎం కేసీఆర్ ఉగాది వేడుకలకు రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. ఆయన మాత్రమే కాదు సమస్త ప్రభుత్వ యంత్రాంగంతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులూ హాజరు కాలేదు. ఒక్క ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రమే వెళ్లారు. ఆయనకు సమాచారం లేక వెళ్లారా లేకపోతే ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వెళ్లారా అన్నదానిపై స్పష్టత లేదు. ఎలా చూసినా రాజ్‌భవన్ వేడుకలను ప్రభుత్వ పరంగా.. పార్టీ పరంగా గుర్తించడానికి కేసీఆర్, టీఆర్ఎస్ నిరాకరించారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా గవర్నర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి సారాంశం ఏమిటంటే తాను తలొంచనని.. ఇంక దూకుడుగా ముందుకెళ్తానని. అదే సమయంలో తాను స్నేహపూర్వకంగానే ఉన్నానని ఉంటానని కూడా చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను చూస్తే గవర్నర్ అంత దూకుడుగా లేరు. కానీ కేసీఆర్ మాత్రం అసలు గవర్నర్‌ను గుర్తించడానికి సిద్ధపడటం లేదు. కేసీఆర్ అనవసర వైరాన్ని గవర్నర్‌తో పెంచుకుంటున్నారా? పరిస్థితి గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారితే ఎవరికి నష్టం ?
తెలంగాణ గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారా ?
గవర్నర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల ప్రభుత్వం పలు అభియోగాలతో ఓ నోట్ విడుదల చేసింది. అందులో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని సిఫార్సు చేసినా అంగీకరించకపోవడంతో ప్రజాదర్భార్లాంటివి నిర్వహించడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమేనని పేర్కొన్నారు. నిజానికి ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి సిఫార్సును అంగీకరించకపోతే.. కేసీఆర్ ఓ సారి కలిసి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది. ఏపీలోనూ గవర్నర్ అలాగే ఎమ్మెల్సీలను ఖరారు చేయకపోతే జగన్ వెళ్లి సమావేశమై.. అభ్యంతరాలను పరిష్కరించారు. దాంతో వెంటనే ఆమోదం లభించింది. నిజానికి ఈ విషయంలో గవర్నర్ అధికారాలు పరిమితం. ప్రభుత్వం పట్టుబడితే తమిళిశై ఆమోదించిఉండేవారు. కానీ రెండో సారి మాట్లాడటానికి కేసీఆర్ సిద్ధపడలేదు. ఇక ప్రజాదర్భార్ లాంటివి నరసింహన్ టైమ్‌లోనూ జరిగాయి. కానీ కేసీఆర్ ఇప్పుడు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా ఒక్క సారిగా వ్యతిరేకత పెంచుకున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
బెంగాల్, తమిళనాడుతో పోలిస్తే తమిళనాడు గవర్నర్ ఏమీ చేయనట్లే !
బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కర్ణాటకలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఇంకా కళ్ల ముందు ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు.. తమిళనాడు గవర్నర్.. స్టాలిన్ ప్రభుత్వంతో తలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత.. తెలంగాణ గవర్నర్ అసలు ఏమీ వివాదాస్పదం చేయడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్లో తానే ప్రభుత్వం అన్నట్లుగా అక్కడి గవర్నర్ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రితో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. చాలా రకాలుగా తమిళిశై ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నారని అనుకోక తప్పదు.
కేంద్రానికి రహస్య నివేదికలు పంపుతున్నారని అనుమానిస్తున్నారా ?
తమిళిశై విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా వైరం పెంచుకుంటున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె దూకుడుగా ఉండకపోయినా ఆమెపై కేసీఆర్ అనుమానాలు పెంచుకున్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే బహిరంగంగా ఆమె ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ అంతర్గతంగా కేంద్రానికి ఏమైనా రహస్య నివేదికలు పంపుతున్నారన్న సమాచారం కేసీఆర్‌కు చేరిందేమో బయటకు తెలిసే చాన్స్ లేదు. కేసీఆర్ రాజకీయంగా చాణక్యుడిలాంటి వారని ఏమీ తెలియకుండా ఆయన ఉద్దేశపూర్వంగా గవర్నర్‌తో వైరం పెంచుకోరని భావించవచ్చు. గవర్నర్ ప్రాధాన్యం తెలుసుకాబట్టే గతంలో నరసింహన్‌తో కేసీఆర్ అంత చనువుగా వ్యవహరించారని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
ఇక తమిళిశై బెంగాల్ గవర్నర్ బాటలోకి వెళ్తారా ?
రాజ్ భవన్ ఉగాది వేడుకలను ప్రభుత్వం, కేసీఆర్ పట్టించుకోకపవడం…కొన్ని రోజులుగా అసలు గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడకపోతూండటంతో ఇక తాను చేయాలనుకున్నది చేస్తానని గవర్నర్ ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్భార్లు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆమెలోనూ పట్టుదల పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే ఆమెకు కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది కానీ నిరుత్సాహం రాదు. అందుకే ఇప్పుడు ఆమె తానేంటో చూపించాలనుకుంటున్నట్లుగా మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజంగా గవర్నర్ తమిళిశై అలా మారిపోతే.. పూర్తిగా కేసీఆరే అందుకు కారణం అనుకోక తప్పదు.