ఏకపక్ష తీరు… పార్టీలు బేజారు

By KTV Telugu On 7 December, 2022
image

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పొజిషన్ ఏమిటి. అధికారానికి వచ్చే సత్తా కాషాయ దళానికి ఉందా… సంజయ్ నాయకత్వం విజయతీరాలకు చేర్చుతుందా.. కాంగ్రెస్ కున్న సంప్రదాయ ఓటు బ్యాంకును బీజేపీ లాగేసుకునే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి. రేవంత్ ఎందుకు సొంత ఇమేజ్ ను సృష్టించుకోలేకపోతున్నారు.. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ

తెలంగాణలో నేతల బలాబలాలపై చర్చ
రాష్ట్రంలో ముక్కోణ పోటీ
కేసీఆర్ కు ధీటుగా నిలబడేందుకు సంజయ్, రేవంత్ పోటీ
కాంగ్రెస్ కు గతమెంతో ఘనం, వర్తమానం శూన్యం
కేడర్ బలమున్నా ఉపయోగించుకోలేక పోతున్న రేవంత్
కేడర్ లేకపోయినా వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకుంటున్న సంజయ్
రేవంత్, సంజయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు
పార్టీల్లో ఇద్దరికీ పెరుగుతున్న వ్యతిరేకత
రేవంత్ ను ఇప్పటికీ బయటివ్యక్తిగానే చూస్తున్న సీనియర్లు
జనంలో తిరుగుతున్న సంజయ్, జనానికి దూరంగా రేవంత్
అందరినీ కలుపుకుపోవాల్సిన తరుణం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తెలంగాణలో ఎవరి బలమెంత అన్న చర్చ ఊపందుకుంది. టీఆర్ఎస్ ను గద్దె దించే మొనగాడు ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోటలో గులాబీ పార్టీ కాలు పెట్టే వరకు కాంగ్రెస్, టీడీపీ నువ్వా- నేనా అని సాగిన పోటీ ఇప్పుడు రూటు మారినట్లే కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ముక్కోణ పోటీ నెలకొంది. అధికార టీఆర్ఎస్ సంగతి కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి బలమున్నదన్నదే పెద్ద ప్రశ్న. పోటీ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ఉంటుందా. రేవంత్ రెడ్డి సంజయ్ మధ్య ఉంటుందా అన్న సరికొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. టీడీపీ వచ్చేంత వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే కావడంతో కేడర్ బలం కూడా బాగా పెరిగింది. టీడీపీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ పార్టీకి కేడర్ స్థిరపడిపోయింది. మరో పక్క బీజేపీకి కేడర్ అంతగా ఉండేది కాదు. భావసారూప్య సంస్థలైన ఆరెస్సెస్, వీహెచ్పీ కేడరే ఆ పార్టీకి శ్రీరామరక్షగా ఉండే వారు. ఇప్పుడా వాదనకు చరమగీతం పాడి కార్యకర్తల బలంతో కొత్త ట్రెండ్ సృష్టించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి హేమాహేమీలుండేవారు. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు పార్టీని పటిష్ట పరిచే చర్యలు చేపట్టారు. వారి నాయకత్వంలోనే కేడర్ బలం కూడా పెరిగింది. కార్యకర్తలకు గౌరవం ఉంటుందన్న విశ్వాసముూ కలిగింది. ఆయా కాలాల్లో వారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందిన జనం కాంగ్రెస్ కు ఓటు బ్యాంకులుగా మారారు. మరో పక్క బీజేపీ తెలంగాణలో ఎన్నడూ అధికారంలో లేదు. పార్టీ కోసం ఆలె నరేంద్ర, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు అహరహం పనిచేసిన మాట వాస్తవం. హైదరాబాద్ మహానగరంలో పార్టీకి గట్టి బేస్ ఏర్పాటైనా జిల్లాలోకి కాషాయ దళం విస్తరించలేకపోయింది. నిన్న మొన్నటి దాకా కూడా పార్టీ గెలుస్తుందన్న విశ్వాసమూ లేదు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పట్ల జనంలో అభిమానం బాగా పెరిగింది. తెలంగాణ ఉద్యమం తారా స్థాయికి చేరుకున్నప్పటికీ వైఎస్సార్ సంక్షేమ పథకాలు ఆయన్ను అసమాననేతగా నిలబెట్టాయి. ఆరోగ్య శ్రీతో వచ్చిన ప్రయోజనాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేరు. ఉచిత విద్యుత్, రుణమాఫీ లాంటి కార్యక్రమాలతో వైఎస్ ఫేమస్ అయ్యారు. కాంగ్రెస్ ను నిలబెట్టారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత కేడర్, లీడర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సంస్ఘాగతంగా పార్టీ వీకైపోయిన మాట వాస్తవం. దానితో ఓటర్లు కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కాస్త దూరం జరిగారు. సమర్థ నాయకత్వాన్ని అందించగలిగితే కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుందనడానికి సందేహించాల్సిన పనిలేదు.. మరో పక్క బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అది కేడర్ పార్టీగా కాకుండా లీడర్స్ పార్టీగానే చాలా కాలం కొనసాగింది. అందులో చాలా మంది లీడర్లు వేర్వేరు కారణాలతో దూరం జరిగి పార్టీ గత నాలుగేళ్లుగా నాయకత్వ సమస్యను సైతం ఎదుర్కొంది. సరిగ్గా అప్పుడే బండి సంజయ్ రూపంలో దూకుడున్న నాయకుడు వచ్చారు. కాంగ్రెస్ కు కూడా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు రాజకీయ చౌరస్తాలో నిలబడి ఉన్నాయి. రేవంత్, సంజయ్ తమ తీరును సమీక్షించుకుంటున్నారు. డూ ఆర్ డై అన్న రీతిలో వారు తమ పార్టీలను నడిపిస్తున్నారు. బీజేపీని జనంలోకి తీసుకెళ్తూ ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా చూపించేందుకు సంజయ్ చేయని ప్రయత్నం లేదు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సంజయ్ ఊరూరా తిరుగుతున్నారు. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తామే తొలి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. వాటిలో పంచ్ లైన్లను జనం ఎంజాయ్ చేస్తున్నారు. సంజయ్ చెప్పిందీ చేయగలరని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలరన్న విశ్వాసాన్ని కూడా జనంలో పెంచగలుగుతున్నారు. మరో పక్క రేవంత్ రెడ్డి ఇంకా జనంలోకి వెళ్లలేదు. గాంధీ భవన్ కు, కొన్ని మీటింగులకు మాత్రమే పరిమితమవుతున్నారు. పాదయాత్ర లాంటి ప్రయోగాలను తాను కూడా చేయాలనుకున్నా ఇంకా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాహుల్ జోడో యాత్ర పూర్తయిన తర్వాత చూద్దాంలే అన్నట్లుగా సమాధానం వచ్చిందని చెబుతున్నారు.

బండి సంజయ్ నిజానికి ఏబీవీపీలో పనిచేసి తర్వాత బీజేపీలో ఎదిగిన నేత. దత్తాత్రేయ, లక్ష్మణ్ లాంటి నేతల సారధ్యంలో పనిచేసి రాటు దేలారు. బీజేపీ రాజకీయాలను బాగా వంట పట్టించుకున్నారు. రేవంత్ అలా కాదు. కాంగ్రెస్ లెక్కల్లో ఆయిన ఔట్ సైడర్. లేటుగా వచ్చి అందరికంటే ముందు పీసీసీ అధ్యక్ష పదవిని పొందారు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ లీడర్లకు ఆయన్ను చూస్తే కడుపుమంట కలుగుతుంది. బండి సంజయ్ వన్ మ్యాన్ ఆర్మీగా ఉండాలని కోరుకుంటారు. అదే తీరులో రాజకీయాలు చేస్తున్నారు. ఈ దిశగా అధిష్టానానికి కొంతమంది నేతలు ఫిర్యాదు చేశారు. అయినా సంజయ్ కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఎందుకంటే మోదీ, షా ఇద్దరీ మద్దతు సంజయ్ కు ఉంది. తెలంగాణలో తొలిసారి ప్రజానాయకుడిగా ఎదిగే వ్యక్తి దొరికారని మోదీ సంబరపడుతున్నారు. అందుకే సంజయ్ చేసే ప్రతీ పనికి అధిష్టానం మద్దతు లభిస్తోంది. మరో పక్క రేవంత్ విషయంలో అలా లేదు. ప్రతీ చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కనిపిస్తున్నాయి. రేవంత్ చేపట్టే ప్రతీ కార్యక్రమానికి నలుగురు సీనియర్లు అడ్డుతొలిగే పరిస్థితి ఉంది. జిల్లాల వారీగా రేవంత్ కు వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.

సంజయ్, రేవంత్ ఇద్దరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎవరినీ కలుపుకుపోవడం లేదని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారని, ఎవరితో వ్యూహాలు పంచుకోవడం లేదని అంటున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర శాఖలో చాలా మంది నేతలు పంటి బిగువున తమ కోపాన్ని అణిచివేసుకుంటున్నారు. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందామన్న ధోరణిలో మౌనం వహిస్తున్నారు. మరో పక్క రేవంత్ రెడ్డిని దించేస్తే తాము పీసీపీ పీఠాన్ని ఎక్కేందుకు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనలకు వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులకు చెప్పకుండా తన వర్గానికి సమాచారం ఇచ్చి మీటింగులు పెడుతున్నారని, అది సహేతుకం కాదని కొందరు ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యమొక్కటే. పార్టీలో అధికారాన్ని రాజ్యాధికారంగా మార్చుకోవడమే వారి ధ్యేయం. ఆ దిశగా బలమైన టీఆర్ఎస్ పార్టీతో పోటీ పడుతున్నామన్న సంగతిని వారు మరిచిపోతున్నారు. తామే సుప్రీం లీడర్స్ అని భావిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. పైగా ఇటీవల రేవంత్ చేసిన కుల వ్యాఖ్యలు పార్టీలోనూ, జనంలోనూ ఆయన పట్ల వ్యతిరేకతా భావానికి అవకాశమిచ్చాయి. సంజయ్ కూడా అంతే ప్రస్తుత ధోరణి కొనసాగిన పక్షంలో ఆయన ఉంటే మేము ఉండమూ అన్న స్తాయికి వ్యతిరేకత పెరగొచ్చు. అందుకే ఇద్దరూ మారాలి. అందరినీ కలుపుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ ఉన్న పరిమితులు అర్థం చేసుకోవాలి. ఇద్దరికున్న రెబెల్ స్టార్ ఇమేజ్ ను వాడుకుంటూనే గెలిస్తే అందరివాడిగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారన్న నమ్మకం కలిగించాలి. మరి ఆ ప్రయత్నంలో వారిద్దరూ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.