తెలంగాణలో పొలిటికల్ గేమ్ మొదలైందా?… సర్వేల స్కెచ్ వేసిందెవరు?

By KTV Telugu On 16 July, 2022
image

తెలంగాణలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదా.. ఎంత ప్రయత్నించినా బీజేపీ అధికారానికి దగ్గరగా రాలేకపోతోందా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకోలేకపోతోందా.. సందట్లో సడేమియాలా లబ్ధి పొందే శక్తులు ఏమిటి… ఇంతకీ ఆ సర్వే చెప్పిందేమిటి.. విపక్షాలకు ఎందుకంత కోపం వస్తోంది….

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్రంలోని విపక్షాలకు ఒక సవాలు విసిరారు. తేదీ ప్రకటిస్తే ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆరా సంస్థ రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై ఒక సర్వే నిర్వహించింది. టీఆర్ఎస్ పనైపోయిందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నప్పటికీ.. విజయం కారు పార్టీనే వరిస్తుందని ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే టీఆర్ఎస్ కు బలం తగ్గుతున్నప్పటికీ… వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్‌కు అత్యధికంగా 38.88 శాతం ఓట్లు పోల్ అవుతాయి. భారతీయ జనతా పార్టీ రెండో స్థానానికి ఎదుగుతుంది. 30.48 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుంది. ఇక కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితమౌతుంది. హస్తం పార్టీకి 23.71 శాతం ఓట్లు పడతాయి. ఇతర పార్టీలు 6.91 శాతం ఓట్లను సాధిస్తాయి. 2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్.. ఇప్పుడు కాస్త బలాన్ని కోల్పోతుంది. ఇక బీజేపీ 2018 ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లు సాధించగా..ఇప్పుడు నిర్వహించిన సర్వేలో 23.5 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకొని.. మొత్తం 30.48 శాతం దక్కించుకుంటుందని ఆరా సర్వే సారాంశం.. కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు సాధించగా ఇప్పుడు  4.72 శాతం ఓట్లను కోల్పోయి..23.71 శాతానికి పరిమితమవుతుందని ఆరా సర్వే చెబుతోంది..

2021 నవంబర్, ఈ సంవత్సరం మార్చి, జులైల్లో మూడు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. అన్ని రిజర్వుడ్, నాన్ రిజర్వుడ్ స్థానాల్లో సర్వే సాగింది. ఎస్సీ-7, ఎస్టీ-4, అర్బన్-11, రూరల్-18 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టిందా సంస్థ. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ హవా వీస్తుందని సర్వే అభిప్రాయపడింది. ఇక్కడ టీఆర్ఎస్- 39.07, బీజేపీ-35.69, కాంగ్రెస్ 18.91, ఇతరులు 6.31 శాతం ఓట్లు సాధిస్తాయి. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్‌‌లో టీఆర్ఎస్- 40.89, బీజేపీ-30.37, కాంగ్రెస్-23.38, ఇతరులు 5.34 శాతం ఓట్లు సాధించగలవు. హైదరాబాద్‌లోనూ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుంది. ఇక్కడ గులాబీ పార్టీకి 40.43 శాతం ఓట్లు పోల్ అవుతాయి. బీజేపీ- 35.32, కాంగ్రెస్- 16.33, ఇతరులకు 7.92 శాతం ఓట్లు పడతాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండల్లో టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకొంటుంది.

నిజానికి టీఆర్ఎస్ కు కేసీఆర్ కుటుంబ పాలనే పెద్ద శాపంగా మారిందని ఆరా సర్వే చెబుతోంది. ఆయన ఫ్యామిలీలో ఎక్కువ మంది పెత్తనం చేయడం సగటు ఓటర్లకు సుతారమూ నచ్చడం లేదు… ఫలితంగా పార్టీ ఓటు బ్యాంకు తగ్గుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తున్నా… అంతర్గత కుమ్ములాట కాంగ్రెస్ ను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతోంది. ఇక అదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన విజయాలు, నరేంద్రమోదీ నాయకత్వం, దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయంతో పాటు సంజయ్ నాయకత్వం బీజేపీకి కొత్త ఊపునిచ్చిందని ఆరా సర్వే నిగ్గుతేల్చింది. ఇతరులకు వచ్చే ఆరు శాతం ఓట్లలో బీఎస్పీకి ఐదు శాతం వస్తాయని సర్వే చెబుతోంది. ఆర్ ఎస్ ప్రవీణ్ రాష్ట్ర బీఎస్పీ పగ్గాలు చేపట్టిన తర్వాత దళిత సామాజిక వర్గాల్లో ఐక్యత పెరిగింది..

మస్తాన్ వలీ నేతృత్వంలో ఆరా సర్వే ఫలితాలు బీజేపీకి చాలా సంతోషాన్నిచ్చాయనే చెప్పాలి. తమ బలం ఏకంగా ఆరు శాతం నుంచి 30 శాతం దాటడం శుభ పరిణామమని ఆయన విశ్లేషించుకుంటున్నారు. ఇకనైనా కేసీఅర్ తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓటమిని అంగీకరించాలని ఆయన అంటున్నారు. ఎన్నికల నాటికి తాము మరింత బలపడి అధికారాన్ని చేపడతామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక ఆరా సర్వేపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇది కేవలం టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. 119 స్థానాల్లో 85 నుంచి 90 స్థానాలు తమకు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో పక్క కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధాన ఆరోపణ. ముక్కోణ పోటీలో తామే విజయం సాధిస్తామని చెప్పుకునేందుకే కేసీఆర్  ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థుల అంటున్నారు. మరో పక్క అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అమలు జరిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయట. ఈ సర్వే వారికి కలిసి వస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు ఆరా మస్తాన్ వలీ సన్నిహితుడని ప్రజాశాంతి పార్టీ నేత కేఎ పాల్ ఆరోపించారు. అటు కేసీఆర్ తోనూ,  ఇటు బీజేపీ నేతలతోనూ మస్తాన్ వలీ ఉన్న ఫోటోలను ఆయన విడుదల చేశారు. రెండు పార్టీలు కూడబలుక్కుని.. ఇతర పార్టీలను మట్టి కరిపించేందుకు ఇలాంటి సర్వే చేయించాయని ఆయన అంటున్నారు. మరో పక్క మస్తాన్ వలీ బీజేపీకి వ్యూహకర్తగా కూడా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన టీమ్ తెలంగాణలో ప్రతీ నియోజకవర్గంలో బీజేపీ బలాబలాలను బేరీజు వేస్తోందట. రాష్ట్రంలో బీజేపీ నెంబర్ వన్ గా మారిందని సర్వే చేస్తే ఎవరూ నమ్మరు కాబట్టి.. రెండో స్థానంలో చూపాలని కొందరి వాదన. కేవలం కాంగ్రెస్ ను బలహీన పరచాలన్న ధ్యేయంతో సర్వే నిర్వహించారని డైరెక్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు పడకూడదన్న ప్లాన్ ఉందట. ఎన్నికల సర్వేలపై ప్రజల్లో  ఉన్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీలు స్కేచ్ వేశాయని కొందరి వాదన. ఈ నేపథ్యంలో ఆరా తదుపరి సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. అప్పుడే అసలు ఆపరేషన్ ఆకర్ష్ బయటపడుతుందన్నది సత్యం..