ఆర్థిక పద్మవ్యూహంలో కేసీఆర్ – వాట్ నెక్ట్స్ !?

By KTV Telugu On 31 May, 2022
image

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. అప్పులు దక్కకుండా చేసిన కేంద్రం ప్రబు్తవాన్ని తీవ్ర ఇక్కట్లలోకి నెట్టేసింది. గత మూడు నెలలుగా పైసా అప్పు పుట్టనివ్వకపోవడంతో ఖర్చులన్నీ పేరుకుపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా అప్పులకు అనుమతి రాలేదు. దీంతో ప్రభుత్వాధినేత కేసీఆర్‌పై భారం పెరిగిపోయింది. తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలా అని మేథోమథనం జరుపుతున్నారు. కానీ మార్గం మాత్రం కనిపించడం లేదు.

రూ. 10 వేల కోట్లు అప్పులు దొరకకపోతే గండమే !

ప్రభుత్వానికి తప్పనిసరిగా చేయాల్సిన చెల్లింపులు కొన్ని ఉంటాయి. జీతాలు, అప్పులకు వడ్డీలు, పెన్షన్లు ఇలాంటివి ఇలాంటి వాటితో పాటు ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుంది. ఈ పథకాలు కాకుండా తప్పనిసరిగా చేయాల్సిన చెల్లింపుల కోసం సబ్సిడీలు సహా విధిగా ప్రతినెలా చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి. వీటికే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దీంతో సరిపోతుంది. కానీ ఈ నెలలో రైతులకు పెట్టుబడి సాయాన్ని చేయాలి.  వానాకాలం రైతుబంధుకు రూ.7600 కోట్లు అవసరమని ప్రభుత్వం  గుర్తించి నిధుల సమీకరణ చేస్తోంది.  కానీ కేంద్రం సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు రూ. పదివేల కోట్ల లభించకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఏపీకి ఒక్క నెలలో రూ. 9వేల కోట్ల అప్పు !

ఈ ఏడాది తెలంగాణ సర్కార్ రూ.లక్ష కోట్ల అభివృద్ధి రుణాలను సమీకరించుకోవడానికి ప్రతిపాదించింది. జూన్‌ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్‌ రుణాలను తీసుకునేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.270 కోట్లకు మించి సమీకరించలేకపోయింది.  పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10 వేల కోట్లు వస్తోంది.  మే నెలాఖరులోనైనా రూ.2000 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకోవాలని భావించినా ప్రయత్నాలు ఫలించలేదు.  పొరుగున ఉన్న ఏపీ పూర్తిగా శ్రీలంక తరహాలో సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఏ లెక్కలు చెప్పడం లేదని తెలిసినా అప్పులు మాత్రం పుడుతున్నాయి.  ఒక్క నెలలోనే రూ. తొమ్మిదిన్నర వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి చాన్సిచ్చింది. కాన తెలంగాణకు మాత్రం అవకాశం చిక్కలేదు.

రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే.. మరి కేసీఆర్ ఏం చేస్తారు ?

కేసీఆర్ కేంద్రంపై దూకుడుగా వెళ్తున్నారు.  దీంతో కేంద్రం రాష్ట్రంపై ఆర్థిక యుద్ధం ప్రకటించినట్లుగా ఉంది. అప్పులు దొరకకుండా తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వైపు రాకుండా ఉండటానికే ఇలాంటివి చేస్తున్నారని అంటున్నారు. ఒక వేళ కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల వైపు చూడనని సంకేతాలు పంపితే…  జూన్‌ మొదటివారంలో బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతించే అవకాశం ఉందన్న అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తందోంది.

ఓ రకంగా ఇప్పుడు కేసీఆర్ ఆర్థిక పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. పథకాల అమలు నిలిచిపోతే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. దళితబంధు, రైతు బంధు, రైతుబీమా, విద్యుత్‌ సబ్సిడీలు, ఆసరా, బియ్యం సబ్సిడీ, స్కాలర్‌షిప్‌లు, కల్యాణలక్ష్మిలతో పాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉది. ఇవి నిలిచిపోతే కేసీఆర్‌కు రాజకీయంగా కష్టం.  దీన్ని లాభంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నించడం ఖాయం. అయితే ఈ రాజకీయం మధ్యలో నలిగిపోయేది ప్రజలే.