రేవంత్ కు అసలైన పరీక్ష మొదలైందా…?

By KTV Telugu On 7 July, 2022
image

తెలంగాణలో కేసీఆర్‌కు ధీటైన నేత ఎవరు ? అని ఎలాంటి చాయిస్‌లు లేకుండా ప్రశ్న అడిగితే.. అత్యధిక మంది నోటి నుంచి వచ్చే సమాధానం రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో ఎక్కడా భయపడకపోవడం దగ్గర్నుంచి కేసీఆర్ ను ఢీకొట్టేందుకు కావాల్సిన దూకుడు.. అంతకు మించి మాటకారితనం.. విషయ పరిజ్ఞానం …రాజకీయ వ్యూహాలపై ట్టు అన్నీ  ఉన్న నేత రేవంత్ రెడ్డి. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా గొప్ప ఫోర్స్‌గా మారుతారని అనుచరులు చెబుతూ ఉంటారు.  పీసీసీ చీఫ్ పదవి రాకపోతే అదే చేసేవారేమో తెలియదు కానీ ఇప్పుడైతే ఆయన చేతిలోకి పార్టీ వచ్చింది. బలమైన కార్యకర్తల నెట్‌వర్క్ ఉన్న పార్టీనే చేతిలోకి వచ్చింరి. మరి రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా ? పదవి చేపట్టి ఏడాది దాటిపోయింది.. కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఊపు తెచ్చారా ? అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని క్యాడర్‌లో కల్పించగలిగారా ?

రేవంత్ రెడ్డి సహజంగానే దూకుడైన నేత. తన దగ్గర రాజకీయంగా కోల్పోవడానికి ఏమీ లేదని డిసైడైపోయి..  తెగించి పోరాడుతున్నారు. ఓ వైపు పదునైన మాటలు, పరుష వ్యాఖ్యలు, కార్యకర్తలను ఉత్సాహపరిచే వ్యూహాలు, నిరసన కార్యక్రమాలతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన దూకుడు కాంగ్రెస్‌కు వర్కవుటుందా లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో సీనియర్లు తమదే పార్టీ అనుకుంటారు. వారేమీ చేయరు.. చేయనివ్వరు. ఇప్పుడు రేవంత్‌కు అదే పరిస్థితి. ఒక్క అడుగు ముందుకు పడుతుంటే.. రెండు అడుగులు వెనక్కు వెళ్తున్నట్లుగానే కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి ఉంది. సీనియర్లు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఏఐసీసీ మాత్రం రేవంత్​ వైపు మొగ్గు చూపిస్తోంది. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏడాది కాలంలో పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఊపందుకుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. పార్టీ పునర్ వైభవానికి అవకాశాలున్నా.. ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితులున్నా  రేవంత్ ఆ స్థాయిలో అందుకోలేకపోతున్నారు. సీనియర్లను కలుపుకుని వెళ్లే ప్రయత్నం రేవంత్ చేశారు.కానీ సీనియర్ నేతలు మాత్రం నమ్మలేదు.  ఈ మధ్యలో ఈగో సమస్యలు వచ్చాయి.  టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే రేవంత్​ రెడ్డి దూకుడు మరింత పెంచారు. వరుస నిరసనలకు ప్రాధాన్యతనిచ్చారు. రైతు సమస్యలను అందిపుచ్చుకున్నారు. కానీ, అదే సమయంలో సీనియర్లకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడంతో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి.  ఆ తర్వాత హుజురాబాద్​ ఉపఎన్నిక కూడా రేవంత్​ వ్యతిరేకవర్గానికి కలిసి వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రేవంత్​ ను ఇరకాటంలో పడేశాయి. ఇలా ఏదో ఓ సందర్భంలో టీపీసీసీ చీఫ్​ పై వ్యతిరేక వెల్లడవుతూనే ఉంది. ఆఖరుకు రాహుల్​ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్​ కు దిగారు. సన్నాహాక సమావేశాలు తమ జిల్లాల్లో వద్దంటూ అల్టిమేటం ఇచ్చినా.. రేవంత్​ మాత్రం నిర్వహించి తీరారు. ఏడాది గడిచినా.. రేవంత్​ పై వ్యతిరేక వర్గం పెరుగుతున్నట్లే మారింది.

రాష్ట్రంలో పలు అంశాలపై రేవంత్​ చేపట్టిన నిరసనలు, ఇతర పార్టీల్లో ఉన్న వారితో పాటుగా పార్టీని విడిచి వెళ్లిన వారిని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలు కొన్ని ఫలించాయి. మరోవైపు డిజిటల్​ సభ్యత్వంలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్​ వన్​ గా నిలిపారు. రేవంత్​ నేతృత్వంలోనే కొంతమంది కీలక నేతలు పార్టీలో చేరారు.  ఇంకా చాలా మంది చేరుతారన్నప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల పలు సెగ్మెంట్ల నుంచి ఇతర పార్టీల నేతలను తీసుకురావడంతో పాత వర్గం ఆగ్రహంతో ఉంటోంది. అయితే రేవంత్ వీరిని పార్టీ హైకమాండ్ కోసమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. పార్టీ పని తీరు కోసం పట్టించుకోవడం లేదు. తన దారిలోనే తాను వెళ్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు హోప్ రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయనపైనే హైకమాండ్  భారం వేసింది.  ఇప్పుడు గెలవడం కాంగ్రెస్ కు మాత్రమే కాదు రేవంత్ రెడ్డికి కూడా చాలా అవసరం. అందుకే చావో రేవో అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తొలి ఏడాది హుషారుగానే నడిపించారు..  మరో ఏడాది గడిచేలోపు ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. అంటే ఇంకా ఎక్కువ సమయం లేదు. ముందస్తు ఎన్నికలంటూ వస్తే ఫలితాలు తేడా రాకుండా ఉండటానికి సన్నాహాలు వేగవంతం చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రమించాల్స ిఉంది.   పార్టీలోని విభేదాలన్నింటికీ మూకుతాడు వేసి.. ఒక్కతాటిపైకి తీసుకురావాల్సిన అత్యవసరం రేవంత్​ పై ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందంటున్నా.. దాని ఎలా అనుకూలంగా మల్చుకోవాలనేది ఇప్పుడు ముందున్న టాస్క్​ గా మారింది. ఇప్పటికే సర్వే బృందాలు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఏ పార్టీకి అనుకూలమే స్పష్టత రావడం లేదు. కానీ, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు రాష్ట్రాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం టార్గెట్​ చేసింది. అందుకే రేవంత్ ఇప్పటి వరకూ చేసినదానికన్నా రెండింతలు చేస్తేనే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం లభించే అవకాశం ఉంది. అంటే అంతా రేవంత్ చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌ను నీట  ముంచినా పాల ముంచినా ఆయనదే భారం.