సర్వేతో కాంగ్రెస్ లో టెన్షన్, కామ్రేడ్ల వైపు చూపు ?

By KTV Telugu On 7 August, 2023
image

KTV Telugu ;-

ఎన్నికల వేళ సర్వేలపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అన్ని పార్టీలు పక్షం రోజులకు ఒక సారి సర్వే చేయించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఇంకా రెండు మూడు నెలల దూరంలో ఉన్న నేపథ్యంలో… విజయవకాశాలు మెరుగు పడలేదని తాజా సర్వే చెప్పడంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆలోచనలు మెదులుతున్నాయి. దానితో కమ్యూనిస్టులను కలుపుకుపోతే ఎలా ఉంటుందన్న చర్చ హస్తం పార్టీ వర్గాల్లో మొదలైందని అంటున్నారు. కేసీఆర్ కు, కామ్రేడ్లకు మధ్య చర్చలు ముందుకు సాగకపోవడంతో పాటు వారిని వదిలించుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్న తరుణంలో… కమ్యూనిస్టులను తమ వైపుకు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

వ్యూహకర్త సునిల్ కనుగోలు ఆధ్వర్యంలో నడిచే మైండ్ షేర్ ఎనలిటిక్స్ సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ఒక సమగ్ర సర్వే నివేదికను ఆ సంస్థ రూపొందించింది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో గెలుపుకు అవసరమైన 60 సీట్లు గెలవడం కాంగ్రెస్ పార్టీకి అంత సులభం కాదని తాజా సర్వే చెబుతోంది. తెలంగాణలో ఉన్న అసెంబ్లీ స్థానాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అందులో ఏ కేటగిరి కింద 41 స్థానాలు, బీ కేటగిరి కింద 42 స్థానాలు, సీ కేటగిరి కింద 36 స్థానాలున్నాయి. ఏ కేటగిరి కిందకు వచ్చే 41 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మైండ్ షేర్ ఎనలిటిక్స్ సంస్థ నిగ్గుతేల్చింది. బాగా కష్టపడితే బీ కేటగిరిలోని కొన్ని స్థానాలు గెలిచే వీలుటుందట. సీ కేటగిరిలోని 36 స్థానాల్లో మాత్రం ఒకటి కూడా గెలిచే ఛాన్స్ లేదట. అయితే ఆయా స్థానాల పేర్లు ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు.

బీ కేటగిరిలో ఇరవై స్థానాలు గెలిచినా అధికారానికి రావడం సాధ్యమవుతుందని నునిల్ కనుగోలు టీమ్ నిర్ధారించగా.. అది అంత సులభం కాదని కూడా హెచ్చరించింది. ఎందుకంటే బీ కేటగిరిలో బీఆర్ఎస్ కంచుకోటలు ఉన్నాయని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యయం, కింది స్థాయి కార్యకర్తలను ఉత్తేజ పరచడం లాంటి అంశాల్లో దూకుడు ఉంటేనే బీ కేటగిరి సీట్లలో గెలవడం సాధ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి. సునీల్ కనుగోలు టీమ్ సర్వే ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు చేరింది. దాన్ని ఆయన అధిష్టానం వద్ద ప్రస్తావించి తదుపరి ఆదేశాలు తీసుకుంటానని చెప్పారు.

మైండ్ షేర్ ఎనలిటిక్స్ సంస్థ సర్వే వచ్చిన నేపథ్యంలో ఇటు టీ కాంగ్రెస్ నేతలు అటు కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఒక ఆలోచన వచ్చినట్లుగా చెబుతున్నారు. ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతున్నట్లు సమాచారం. మునుగోడు ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు మద్దతిచ్చిన వామపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికార పార్టీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. సీపీఐ, సీపీఎం చెరి రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కేసీఆర్ దగ్గర బేరం పెట్టాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెరో ఎమ్మెల్సీ స్థానం కోరుతున్నాయి. అయితే కేసీఆర్ అందుకు సుముఖంగా లేరన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. ఆయన చెరో అసెంబ్లీ సీటుతో పాటు ఇద్దరిలో ఒకరికి మండలి స్థానం కేటాయిస్తానని చెబుతున్నారట. పైగా అదే ఫైనల్ అని అంటున్నారట. అంటే వాళ్లు అడిగిందీ టూ ప్లస్ టూ ప్లస్ టూ… కేసీఆర్ ఇస్తానంటున్నదీ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్.. దానితో బీఆర్ఎస్ మైత్రి వద్దని వామపక్షాలు అనుకుంటున్నాయట. ఈ నేపథ్యంలోనే వామపక్షాలను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆలోచనలో పడ్డారు. సీపీఐ, సీపీఎం ఇద్దరికీ కలిపి పది స్థానాల వరకు ఇచ్చేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ పార్టీలో వినిపిస్తున్న వాదన. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న స్తానాలు కేటాయిస్తే విజయవకాశాలుంటాయని కాంగ్రెస్ నమ్ముతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కోటలను కూడా బద్దలు కొట్టే వీలుంటుందని విశ్వసిస్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..