ఓటు చీల్చు. కాంగ్రెస్ ను కొట్టు.. వాటే గేమ్..

By KTV Telugu On 9 August, 2023
image

KTV Telugu ;-

అక్బరుద్దీన్ చెప్పింది కరెక్టా.. కేసీఆర్ చెప్పింది కరెక్టా… అసదుద్దీన్ చెప్పింది కరెక్టా.. ముగ్గరు కరెక్టే చెప్పారా.. జనం అర్థం చేసుకోవడంలోనే అసలు మతలబు ఉందా. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతోంది.. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ …

ఎప్పుడు ఎవడితో పొత్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరినీ దూరం పెట్టాలో తెలిసిన వాడే నిజమైన రాజకీయ నాయకుడు. అవసరం ఉంటే అల్లుడూ అని పిలవాలి. అవసరం తీరేతే ఎమని చెప్పి పంపించెయ్యాలో వాళ్ల వాళ్ల విచక్షణను బట్టి ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే. ఎప్పటికప్పుడు లాస్ట్ పంచ్ మనదైతే ఆ ఆనందమే వేరప్పా అన్నట్లుగా ఉంటుందీ ఆయన తీరు. అంతలోనే మళ్లీ మొదటి పంచ్ పడినట్లుగా కొత్త గేమ్ షురు చేస్తారూ మన సారూ..

బీఆర్ఎస్ తో రెండు ప్రధాన పార్టీలు కలిసే అవకాశమే లేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణ అధికార పార్టీకి దూరమే. కమ్యూనిస్టులతో చర్చలు ఒక కొలిక్కి రాలేదు. వాళ్లతో పొత్తు ఉన్నా దాని ప్రభావం ఒకటి రెండు జిల్లాల్లో నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం. కాస్త విస్తత స్థాయిలో ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలని కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆలోచిస్తే కంటి కనిపించే దూరంలోనే ఎంఐఎం నిలబడీ ఉంటుంది. పాత బస్తీలో మైనార్టీ వర్గాల ప్రయోజనాలు కాపాడే పార్టీగా కనిపించినా… ఎంఐఎం ఇప్పుడు తన ప్రాబల్యాన్ని దేశ వ్యాప్తంగా పెంచుకుంటూ పోతోంది. కేసీఆర్ కు కావాల్సింది కూడా అదే మరి. బీఆర్ఎస్ ను ఆయన దేశవ్యాపితం చేయాలనుకుంటున్నారు. అంటే సేమ్ టు సేమ్ గేమ్ అన్నమాట. ముందుగా ఈ సారి తెలంగాణలో గెలిస్తే తదుపరి ఆట కాస్త బలంగా ఊపందుకుంటుందని భావిస్తున్న తరుణంలో అందుకు పావులు కదపడం ఎలా అన్న ఆలోచన కేసీఆర్ లో మెదులుతోంది. మరో పక్క దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో జెండా పాతాలంటే ఏదో కొత్త రూటు వెదుక్కోవడం అనివార్యమని ఎంఐఎం కూడా గుర్తించింది.

బీఆర్ఎస్ కంటే ముందు ఎంఐఎం మహారాష్ట్రలో ఎంట్రీ ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. తర్వాత ఉత్తరాది వైపు ప్రయాణించినా బిహార్, యూపీలో ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం కలగలేదు. కాకపోతే మైనార్టీ ఓట్లను చీల్చడంలో మాత్రం సక్సెస్ అయినట్లు ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. కాస్త నిదానించిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానే వస్తున్నాయి. ఇప్పుడేం చేయాలన్న ఆలోచన ఎంఐఎంలో మెదులుతుండగా, అధికార బీఆర్ఎస్ తో ఎలాంటి పేచీ లేకుండా ఎన్నికల రాజకీయాలు చేయాలని మజ్లీస్ తీర్మానించుకున్నట్లు తాజా పరిణామాలు వివరిస్తున్నాయి.

ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఆఖరి సమావేశాల్లో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వదిలిన స్టేట్ మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ కలిగిస్తోంది. బీఆర్ఎస్, మజ్లీస్ ఎప్పటికీ cమిత్రపక్షాలేనని భవిష్యత్తులో కూడా తమ మైత్రిని కొనసాగిస్తామని ఆయన అన్నారు . ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అక్బరుద్దీన్ ప్రకటించడం కూడా శుభ పరిణామమే కాకుండా తమకు లభించిన ఆశీర్వాదమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తూ రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం తెలంగాణకు ఉందని చెప్పుకొచ్చారు. ఇంకేముంది ఎన్నికల పొత్తు ఖరారైందని విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలోనే పెద్దన్న అసదుద్దీన్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ స్టేట్ మెంట్ తో తెగ టెన్షన్ పడిపోయి ఇదేంటి కథ మొదటికొచ్చిందని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. అక్బరుద్దీన్ చెప్పినదీ కరెక్టే, అసదుద్దీన్ చెప్పినది కూడా కరెక్టే. ఎందుకంటే తాము బీఆర్ఎస్ తో ఉంటామని అక్బరుద్దీన్ అన్నారే తప్ప పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా చెప్పలేదు. కేసీఆర్ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. పొత్తులకు తొందరలేదనేది అసదుద్దీన్ రొటీన్ డైలాగ్. ఎందుకంటే పొత్తులు ఎన్నికలప్పుడే ఖరారవుతాయి కదా.. ఇందులో అసలు కోణం వేరే ఉంది. ప్రత్యర్థిని కొట్టేందుకు ఇద్దరం కలిసి పనిచేస్తామన్నది అర్థం చేసుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనార్టీల ఓట్లు చీల్చే దిశగా ఇరు వర్గాలు ముందుకు సాగుతున్నాయన్నది మరిచిపోకూడదు. ఎంఐఎంకు ఓల్డ్ సిటీలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ సారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి రెండు సీట్లు గెలుచుకోవాలని అసద్, అక్బర్ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్లు కోరిన చోట బీఆర్ఎస్ వైపు నుంచి బలహీనమైన అభ్యర్థులను నిలబెడితే చాలు.. అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ను ఓడించేందుకు అన్నదమ్ములిద్దరూ కేసీఆర్ ఏం కావాలన్నా చేస్తారు.

అక్బరుద్దీన్ పబ్లిగ్గా చేసిన కామెంట్స్ లో ప్రయివేటు ఒప్పందం ఉందని మరిచిపోకూడదు. ఎన్నికల నాటికి వాళ్లు చెప్పుకున్న స్నేహం ఎలా టర్న్ అవుతుందో కూడా ముందే ఊహించొచ్చు. ఎంఐఎంతో బీఆర్ఎస్ డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఒక ఆటాడుకుంటుందని కూడా కేసీఆర్ కు తెలియనిది కాదు. అప్పుడు మరో రకంగా ఏర్పడే ఓట్ల చీలిక బీఆర్ఎస్ కు కూడా ఇబ్బందికరమే అవుతుంది.అందుకే బయటకు ఎన్ని మాట్లాడినా సైలెంట్ గా ఆఖరి పంచ్ కు కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఎలాగూ ఆయన, అసద్ భాయిభాయీలే కదా. ఎంఐఎం నేతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రగతి భవన్ కు వెళ్లొచ్చు కూడా. అ సంగతి అందరికీ తెలుసనుకోండి

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..