కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్‌ను హైకమాండ్ మళ్లీ పెండింగ్‌లోనే పెట్టింది. ఆశావహులు ఎక్కువ మంది లేకపోయినా.. పైకి నెట్టే వాళ్లు కొంతమంది, కిందకు లాగే వాళ్లు మరికొంతమంది ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి..
తెలంగాణలోని 17 లోక్ సభా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 14 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. మూడు నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ కొన్ని ఇబ్బందుల కారణంగా జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. హైదరాబాద్ విషయంలో పార్టీ సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా ఖమ్మం, కరీంనగర్ స్థానాలు మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాయి. ఈ రెండు నియోకవర్గాల్లో సామాజిక సమీకరణాల అంశంపై చర్చ జరుగుతున్నది. కరీంనగర్ బీసీకి, ఖమ్మం టికెట్ కమ్మ సామాజికవర్గాలకు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే పరిశీలనలో పలువురి పేర్లు ఉన్నందున ఎవరిని ఖరారు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రమే ఖరారు చేయాల్సి ఉన్నది.అయితే అందులోనూ కరీంనగర్ టికెట్ పీటముడి విప్పడం అధిష్టానం వల్ల కావడం లేదు. కరీంనగర్ తో సంబంధం లేని పార్టీ నేతలు, మంత్రులు కూడా అందులో తలదూర్చే ప్రయత్నం చేస్తున్నందునే.. ఎవరినీ నొప్పించకుండా అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోంది.
ఒకరిద్దరు రాష్ట్ర మంత్రుల డిమాండ్ల కారణంగానే కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి ప్రకటన జాప్యమవుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని వారంతా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి వారిని ఒప్పించిన తర్వాతే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు…
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికి మూడు విడతల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగినా ఏ విషయం తేల్చలేదు. తాజాగా జరిగిన సమావేశంలోనూ ఏ నిర్ణయానికి రాలేకపోయారు. ఒకదశలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఖరారయ్యిందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డు తగలడంతో ఆగినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ నుంచి కరీంనగర్ స్థానానికి ప్రవీణ్‌రెడ్డి పేరును మాత్రమే పంపించారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో ప్రవీణ్‌రెడ్డి పేరుతోపాటు వెలిచాల రాజేందర్రావు, రుద్ర సంతోష్‌కుమార్, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గ ఇన్చార్జి ఏకాభిప్రాయంగా వెలిచాల రాజేందర్రావు పేరును ప్రతిపాదించారు. దీంతో రాజేందర్రావు పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కార్యాచరణ సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఇంతతో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరునే ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆశించారు. కరీంనగర్ నుంచి తన స్థానాన్ని హుస్నాబాద్‌కు మార్చుకున్న పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించడానికి ప్రవీణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోజు సర్దిచెప్పారు. ఎమ్మెల్సీ పదవికాని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కానీ కల్పిస్తామని హామీ ఇచ్చి ఆయనను అసెంబ్లీ టికెట్ ఆశించకుండా ఆపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం అభ్యర్థిత్వం ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే పొన్నం ప్రభాకర్ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినట్లుగా చెబుతున్నారు…
నిజానికి కరీంనగర్ ఒక టఫ్ ఫైట్ గానే భావించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిట్టింగ్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడించడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఒకటికి పది సార్లు ఆలోచిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే వీలుంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…