కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో…ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…తన స్టైల్ పాలిటిక్స్ చేస్తున్నారా ? భక్తులతో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయ్. అలిపిరి వద్ద శివాజీ విగ్రహాలను టీటీడీ సిబ్బంది అడ్డుకోవడం…పెద్ద వివాదంగా మారింది. సీఎం జగన్ వ్యవహారశైలి కారణంగా…ఏపీకి చెడ్డపేరు వస్తోందంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత…ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని…ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు.
తిరుమల పుణ్యక్షేత్రం…హిందూవులకు ఆరాధ్య క్షేత్రం. నిత్యం భక్తులతో కళకళ లాడాల్సిన తిరుమల…జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. లడ్డూల విక్రయాలలోనో, టీటీడీ సరకుల కొనుగోళ్లలోనో, పూజ, దర్శనాల టికెట్ల బ్లాక్ మార్కెట్ అమ్మాకాల విషయంలోనో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయ్. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏవీ ధర్మారెడ్డిని….తీసుకొచ్చి తిరుమలలో పెద్ద పీట వేశారు. ఆ తర్వాత ఏడుకొండల వాడికి భక్తులు ఇచ్చిన కానుకలను అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో…జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. స్వామి వారి ఫిక్స డ్ డిపాజిట్లను సెక్యూరిటీ పెట్టాలని భావించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేసే ఎమ్మెల్యే రాజాసింగ్… ఏపీ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. జగన్ తీరుతో హిందూ దేవుళ్లకు చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకోస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాలను పోలీసులు అనుమతించకపోవడంపై శివాలెత్తారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తిరుపతి అంశం వైరల్ అవుతోందంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. జగన్ తప్పుడు నిబంధనలే ఈ వివాదానికి కారణమన్న రాజాసింగ్…ఆయన ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో శ్రీశైలం ఆలయం ప్రాంగణంలోని దుకాణాల కేటాయింపులపై రాజాసింగ్…పెద్ద రచ్చ చేశారు. శ్రీశైలంలో ముస్తింల ఆధిపత్యం పెరిగిపోయిందని…హిందూ ఆలయాలకు చెందిన దుకాణాలను ముస్లింలకు ఎలా కేటాయిస్తారంటూ…నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో దుమారం రేపింది. ఏపీ బీజేపీ నేతలు సైతం రాజాసింగ్ కు మద్దతు పలికారు. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డితో రజాక్ రెచ్చిపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం… జిఒ నెం.426 ద్వారా శ్రీశైలంలో ఇతర మతాలన వ్యాపారవేత్తలను నిషేధించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం…ఈ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత వైసీపీ సర్కార్…రజాక్ భార్యపై వేటు వేసింది.
టీటీడీలో సమర్ధత కంటే కులానికే ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయ్. తిరుమలలో కీలక పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టారు. టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి, ఈవోగా జవహర్ రెడ్డి, ఏఈవోగా ధర్మారెడ్డిని నియమించడం దుమారం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని వివాదాస్పద నిర్ణయాలతో తిరుమల పవిత్రతను మంటగలిపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నారు.